మొలతాడు లేని వారితో తిట్టించకు.. పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ మరో సంచలన లేఖ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ రాశారు.

Update: 2023-06-23 07:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ రాశారు. పవన్ కల్యాణ్ సినిమాలో హీరో తప్ప రాజకీయాలలో హీరో కాదని అన్నారు. ఈ లేఖలోనూ పవన్ కల్యాణ్‌ను సినీ నటుడు అని సంబోధిస్తూనే లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకులు, మీ అభిమానులతో తనను ఇష్టం వచ్చినట్లు తిట్టించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీ అభిమానుల చేత బండ బూతులతో మెస్సేజులు పెట్టిస్తారా అని ముద్రగడ పద్మనాభం నిలదీశారు. నన్ను తిట్టడానికి మీ అభిమానులు ఎవరు అని మండిపడ్డారు.

‘కాపు కులం కోసం నేనేమీ చేయనట్టు స్వార్థపరుడను అని కులాన్ని ఉపయోగించుకుంటున్నానని , అమ్మేసానని రకరకాల మాటలు చెప్పడం సినిమా డైలాగులను మరిపించిందండి. గోచీ, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే, మీరు తిట్టండి, గోచీ మొలతాడు ఉన్న వారితో సమాధానం చెప్పించగలను. ఒక విషయం పవన్ కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది అని నిలదీశారు. ఏనాడైనా కాపుల గురించి ఆలోచించిన సందర్భం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

కాకినాడ సిటీ నుంచి తోకముడిస్తే పిఠాపురం నుంచి నాపై పోటీ చేయండి అని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఎన్నికల బరిలో ఉండాలా లేదా అనుకుంటున్న సమయంలో మీరు, మీ జనసైనికులు తిట్టడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహం తనలో వచ్చినట్లు ముద్రగడ వెల్లడించారు. యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు చాలా సంతోషం అని అన్నారు. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుందని సంగతి మరవద్దు అని ముదగ్రగడ పద్మనాభం హెచ్చరించారు.

పోరాటాల్లో మీ పాత్ర ఎక్కడ?

1988లో వంగవీటి రంగాని హత్య చేసిన తరువాత ఎంతో మందిని అమాయకులను జైలులో పెట్టిన సంఘటనపై ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జైలులో ఉన్న వారిని ఎప్పుడైనా తమరు వెళ్ళి చూసారా? అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. జైలులో ఉన్న వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం కోసం ఏ రోజైనా పలకరించడానికి వారి గృహాలకు వెళ్ళారా? అని నిలదీశారు. జైలులో ఉన్న వారికి బెయిల్స్ తేవడం కోసం ఎప్పుడైనా అడ్వకేట్స్‌తో మాట్లాడారా? జైలులో ఉన్న వారి మీద టెర్రరిస్టుల కోసం తయారు చేసిన చట్టంలోని కొన్ని సెక్షన్లు వేసి కేసులు పెట్టిన సంగతి తెలసా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 1988-89లో 3500 మంది అమాయకుల పై పెట్టిన కేసులు తీసివేయమని ఎప్పుడైనా నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కలిసి కోరారా? 1993-94 లో రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి సభలో కాపులను గొడ్డును బాధినట్లుగా బాదిన బాధితులను ఏరోజైనా పలకరించారా? అంటూ మండిపడ్డారు. 1993-94 ఉద్యమ సందర్భముగా అప్పట్లో పెట్టిన కేసులు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుని తీసివేయమని అడిగారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ మోచేతికింద నీళ్లు తాగను

మీరు నన్ను తిట్టిన తరువాత మాత్రమే స్పందించాను. చంద్రశేఖరరెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మీ కోసం వారిని దూరం చేసుకోను. ఈ బంధంపై మీ అభిమానుల చేత తిట్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డోంట్ కేర్’ నేనేమి మీ బానిసను కాదు. మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదు. తాగను కూడా అని తేల్చి చెప్పేశారు. తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ వంటి నాయకులు మీ కోసం నా దగ్గర సుమారు మూడు గంటలపాటు చర్చించారని..అనేక సార్లు తాపత్రాయపడ్డారని గుర్తు చేశారు. మీకోసం పరితపించిన తోట త్రిమూర్తులను ఓడించాలని పిలుపును ఇవ్వడం అర్థంకావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైలు దగ్ధం కేసులో అమాయకులకు మీరేం చేశారు

2016 తుని సభ, రైలు దగ్ధం కేసుల్లో ఉన్న బాధితులను ఎప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించారా అని ముద్రగడ పద్మనాభం లేఖలో ప్రశ్నించారు. అక్రమంగా అన్యాయంగా పెట్టిన కేసులు తీసివేయమని చంద్రబాబునాయుడుని, వైఎస్ జగన్‌ని ఎప్పుడైనా కోరారా అని ముదగ్రడ నిలదీశారు. కాపు మంత్రుల కోరికమేరకు సీఎం వైఎస్ జగన్ 2016నుండి పెట్టిన కేసులను ఎత్తివేశారని చెప్పుకొచ్చారు. ‘కాపు కులం కోసం నేనేమీ చేయనట్టు స్వార్థపరుడను అని కులాన్ని ఉపయోగించుకుంటున్నానని , అమ్మేసానని రకరకాల మాటలు చెప్పడం సినిమా డైలాగులను మరిపించిందండి.

ఒక విషయం పవన్ కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది అని నిలదీశారు. ఏనాడైనా కాపుల గురించి ఆలోచించిన సందర్భం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. యువతను భావోద్వేగానికి గురి చేస్తున్నది ఎవరో మీ ప్రసంగాలలోనే తెలుస్తోంది అని అన్నారు. డా. అంబేద్కర్ కోన సీమ జిల్లా పేరు పెట్టిన సందర్భములో అగ్నిగుండంగా మారిన గొడవలలో ఎంతో మంది అమాయకులపై పెట్టిన కేసులకు బెయిల్ రాని పరిస్థితులలో ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వారికి అండగా నేను ఉన్నానని నిత్యం మిమ్మల్నే తరించే వారికోసం కోనసీమకు తమరు ఎందుకు వెళ్ళలేదు ? అని పవన్‌ను ప్రశ్నలతో కడిగిపారేశారు. వారికి బెయిల్ కోసం అడ్వకేట్స్‌తో మాట్లాడి బెయిల్ వచ్చే ఏర్పాటు ఎందుకు చేయలేదు ? కేవలం తమరి కోసం అందరూ రోడ్డు మీదకు రావాలి ? రోడ్డు మీదకు వచ్చిన వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి మీరు చేతనైన సహాయం చేయరా ? అని ముద్రగడ పద్మనాభం నిలదీశారు.

నా కుటుంబాన్ని హింసించినా..

మీ సినిమా విడుదల సందర్భంలో అభిమానులు ప్లెక్సీలు పెట్టడం, రిలీజు రోజున స్వీట్లు మరియు బాణసంచా కోసం వేలాది రూపాయలు ఖర్చు పెడతారని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. మొదట రెండు మూడు వారాలు చిత్రం హౌస్ ఫుల్ అవ్వకపోతే అమ్ముడు పోని టిక్కెట్లు మీ అభిమానులు డబ్బులు వేసుకుని ప్రతీ రోజు కొంటూ ఉంటారు అని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టలేని వారు కూడా మీ కోసం విపరీతంగా ఖర్చు చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమంలో తన కుటుంబం ఎదుర్కొన్న పరాభవాలను ముద్రగడ లేఖలో ప్రస్తావించారు. తన భార్య మంగళసూత్రం తెంపి బూతులు తిడుతూ పోలీసువారు బూటు కాలితో తన్నినప్పుడు , కొడుకుని లాఠీలతో బాదుకుంటూ పోలీసు వారు తీసుకువెళ్ళినప్పుడు, నా కోడలిని బూతులు తిట్టినప్పుడు మిమ్మల్ని మా మీద సానుభూతి చూపమని అప్పుడు , ఇప్పుడు అడగలేదే ? అని ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు. అలాంటి తనను ఎందుకు తిడతారని ప్రశ్నించారు. అయినా తిడితే నేనెందుకు పడాలి ? అని ముద్రగడ పద్మనాభం నిలదీశారు.

Also Read..

కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం.. జగన్ వ్యూహంలో భాగమా?  

Tags:    

Similar News