Tirumala: తిరుమలలో దీపావళి ఆస్థానం.. రద్దీ ఎలా ఉందంటే
తిరుమలలో దీపావళి ఆస్థానం నిర్వహించింది టీటీడీ. భక్తుల రద్దీ సాధారణంగా ఉండగా.. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
దిశ, వెబ్ డెస్క్: దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించారు వేద పండితులు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నివేదనలు సమర్పించారు. ఈ వేడుకగా కంచికామకోటి పీఠాధిపధి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించామని ఈఓ శ్యామలరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి భక్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం మలయప్పస్వామి తిరుమాఢవీధుల్లో ఊరేగుతూ దర్శనమివ్వనున్నారు.
విజయేంద్ర సరస్వతి (Vijayendra Saraswati) మాట్లాడుతూ.. టీటీడీ నూతన ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఆస్థానంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
దీపావళి కావడంతో.. తిరుమలలో నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ (TTD) రద్దు చేసింది. ప్రస్తుతం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్ లేకుండా క్యూలైన్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు 12 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న 55,219 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 16,211 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.4.37 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.