శ్రీవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.

Update: 2023-04-09 06:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. వరుస సెలవులతోపాటు వారాంతపు రద్దీతో దేశవ్యాప్తంగా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. శుక్రవారం మొదలైన ఈ రద్దీ ఆదివారం వరకు కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. ఆదివారం రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల కొండపై రద్దీ పెరగడంతో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్‌ఎస్‌డీ దివ్యదర్శనం టోకెన్లు ఉన్న వారు మాత్రమే రావాలని ఇప్పటికే ప్రకటన చేసింది. టోకెన్లు లేని వారు స్వామి వారి దర్శనం కోసం వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించింది.ఇకపోతే సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరు స్వామి వారిని దర్శించుకునేందుకు 30 గంటలుపైనే పడుతుండటంతో ఈ ప్రకటన చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు

ఇదిలా ఉంటే భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అంతే కాకుండా పిల్లలకు పాలు సైతం అందిస్తున్నారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News