తిరుపతిలో నలుగురికి కరోనా పాజిటివ్
తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపింది. ...
దిశ, తిరుపతి: తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపింది. రుయాస్పత్రిలో చేసిన కొవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో వస్తున్న కొవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రుయాస్పత్రి, ఏరియా, ప్రాంతీయ వైద్యశాలల్లో కొవిడ్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో రుయాస్పత్రిలో 20మందికి పైగా రాపిడ్ పరీక్ష చేశారు. నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ముగ్గురు తిరుపతికి చెందిన వారు. కాగా ఇందులో ఒకరు రెండు రోజులుగా రుయాస్పత్రిలో ఎం.ఎం. వార్డులో చికిత్స పొందుతున్నారు. అలాగే తిరుమలకు వచ్చిన బెంగళూరుకు చెందిన మరో 70 ఏళ్ల వృద్ధురాలికి కూడా పాజిటివ్ వచ్చింది. తిరుపతికి చెందిన ఇద్దరికీ కొవిడ్ లక్షణాలు లేకపోవడం, ఆరోగ్యంగా ఉండటంతో వారు హోం ఐసోలేషన్‌లో ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. మిగిలిన ఇద్దరిని మాత్రం రుయా అధికారులు ఆస్పత్రిలోని కొవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు..