పల్నాడు వైసీపీలో గందరగోళం.. ఓటమితో పత్తా లేని లీడర్లు
పల్నాడు జిల్లా వైసీపీలో కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా నియమించాల్సిన నియోజకవర్గ ఇంఛార్జ్‌లపై చర్చ జరుగుతోంది.
దిశ, పల్నాడు: పల్నాడు జిల్లా వైసీపీలో కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా నియమించాల్సిన నియోజకవర్గ ఇంఛార్జ్‌లపై చర్చ జరుగుతోంది.ఎన్నికల ముందు చిలకలూరిపేటకు అప్పటి వరకూ ఉన్న నేతను మార్చి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఓటమి తర్వాత వారినే కొనసాగిస్తారా... లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్న అనుమానాలు కార్యకర్తల్లో నెలకొన్నాయి. జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపు పూర్తి కావడంతో అధిష్టానం ఇక నియోజకవర్గాల ఇంఛార్జ్‌లపై దృష్టి పెట్టినట్లు అంతా భావిస్తున్నారు. అత్యంత్య రాజకీయ ప్రాధాన్యమున్న నియోజకవర్గాలకు కొత్త నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఎవరన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్దులు విజయం సాధించలేకపోయారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ తో పాటు పార్లమెంట్ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో పల్నాడు జిల్లాలో పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
పెండింగ్ నియోజకవర్గాలపై దృష్టి..
ఈ క్రమంలోనే గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డినే కొనసాగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఎప్పుడో జిల్లాకు వస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్‌లను కూడా వెంటనే నియమించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి కావటి మనోహర్ నాయుడుకి జగన్ అవకాశం ఇచ్చారు. అయితే ఆయన ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు.
దీంతో పార్టీ క్యాడర్ కూడా అయోమయంలో పడిపోయింది. కావటి తిరిగి పేటకు వెళ్లే ఉద్దేశంలో లేరు. గుంటూరు జిల్లాలోని ఉండేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొత్త వ్యక్తిని ఇంఛార్జ్‌గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ఎవరిని నియమించినా మాజీ మంత్రి విడదల రజిని అండదండలు ఉండాల్సిన పరిస్థితి ఉన్నట్టు సమాచారం. మరోవైపు అక్కడ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా ఉన్నారు. వీరిద్దరిని సమన్వయం చేసుకునే వ్యక్తే ఆక్కడ నెగ్గుకురాగలుగుతారు. అయితే ఎమ్మెల్సీనీ కూడా ప్రస్తుతం ఇంఛార్జ్ గా నియమించలేదు. దీంతో కొత్త వ్యక్తే ఇక్కడ ఇంఛార్జ్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. మరొక నియోజకవర్గం సత్తెనప్లలి.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా అధ్యక్షుడయ్యారు.
దీంతో ఆయన సత్తెనపల్లిని వీడినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. అక్కడున్న రెడ్డి సామాజిక వర్గం నేతలతో రాంబాబుకు మొదటి నుండి పొసగటం లేదు. ఈ క్రమంలోనే రాంబాబును గుంటూరు తీసుకొచ్చారని అంతా అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే మోదుగుల వేణు గోపాల రెడ్డిని అధిష్టానం సత్తెనపల్లి వెళ్లమన్నట్లు చెప్పుకున్నారు. అయితే అందుకు మోదుగుల సంసిద్దత వ్యక్తం చేయక పోవడంతో ఆయన్ను పల్నాడు, గుంటూరు జిల్లాల పరిశీలకుడిగా నియమించారు. సత్తెనపల్లి నుండి రెడ్డికి అవకావం ఇస్తారా లేదా మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణకు ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.
వీటిపై క్లారిటీ తర్వాతే పార్లమెంటు ఇంచార్జిగా..
నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకే పరిమితం అయ్యారు. ఆయన స్థానంలోనే మోదుగులను ఇంఛార్జ్ గా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ కంటే పార్లమెంట్ కు వెళ్లటానికే మోదుగుల మొదట నుండి మొగ్గు చూపుతున్నారు. దీంతో పల్నాడు జిల్లా పరిశీలకుడిగా ఉన్న మోదుగులను పార్లమెంట్ ఇంఛార్జ్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సత్తెనపల్లి, చిలకలూరిపేట స్థానాలపై ఒక స్పష్టత వచ్చిన తర్వాతే పార్లమెంట్ ఇంఛార్జ్ గా నియమించే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా నేతలు చురుగ్గా పనిచేయాలంటే అన్ని స్థానాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని నేతలు అంటున్నారు. మరి ఆ దిశగా అధిష్టానం కూడా అడుగులు వేస్తుందా లేక ఆచి తూచి వ్యవహరిస్తుందా అన్నది వేచి చూడాలి...