ఎకరాకు రూ.20 వేలు పరిహారం అందించాలి
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది అని మాజీమంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది అని మాజీమంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ, ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటంలో చూపించే ఉత్సహం రైతులను ఆదుకోవడంలో చూపకపోవడం బాధాకరమన్నారు. నిత్యం ఢిల్లీ యాత్రలు, పథకాల పేర్లు చెప్పి బటన్ నొక్కడం తప్ప ముఖ్యమంత్రిగా జగన్ సాధించింది శూన్యం అని విమర్శించారు. ‘పంటచేతికొచ్చే సమయంలో కురిసిన వానలకు పలు జిల్లాల్లోని ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, మిర్చి, మినుము, పెసర, సెనగ, వెరుశనగ పంటలతో పాటు అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు వర్షానికి దెబ్బతినడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కానీ జగన్మోహన్‌రెడ్డి మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఏవిధంగా చావుదెబ్బ కొట్టాలి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఎలా గెలుపించుకోవాలనే అధికార కాంక్ష తప్ప రైతుల గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది’ అని కేఎస్ జవహర్ ధ్వజమెత్తారు.
ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పంట నష్టంపై మంత్రులు గాని, అధికారులు గాని రైతులను కనీసం పలకరించిన దాఖలాలు లేవు. పక్క రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం ప్రకటించి రైతులకు అండగా నిలిచింది. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని పది రోజులు గడిచినప్పటికి... ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పత్తాలేకుండా పోయారు. ప్రతిపక్షాలపై దాడులు, అక్రమ కేసులు బనాయించడం ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం రాష్ట్రంలో నిత్యకృత్యమైయ్యాయి. వర్షాల కారణంగా మరణించిన బాధితుల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా అందజేయాలి. హార్టికల్చర్, వాణిజ్య పంటల నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలి. వర్షపు నీటిలో తడిసిన వరిధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి తక్షణమే కొనుగోలు చేయాలి. పంట రుణాల తక్షణ పునరుద్ధరణ చేపట్టాలి. బాధిత రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి. వడగండ్ల వాన కారణంగా దెబ్బతిన్న ఆస్తికి పరిహారం చెల్లించాలి. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం అందించాలి’అని కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు.