పేదల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా : డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతామని డిప్యూటీ సిఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతామని డిప్యూటీ సిఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. పేదల ఆరోగ్యానికి సిఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి భరోసానిస్తున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలందించాలన్న తపనతో పనిచేస్తున్నారని... ఇందుకోసం సీఎం తరచూ సమీక్షలు నిర్వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. అమరావతిలో ఆయుష్మాన్ భవ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 53 వేలకు పైగా పోస్టుల్ని వైద్య ఆరోగ్య శాఖలో నియమించి దేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు.