నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన CM చంద్రబాబు ఫ్యామిలీ
ప్రముఖ టాలీవుడ్ నటుడు దివంగత నందమూరి హరికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నటుడు దివంగత నందమూరి హరికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈయన ఈయన నందమూరి తారక రామారావు మూడో కుమారుడు. ‘ శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్ళామా, తాతమ్మకల, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో,శివరామరాజు,టైగర్ హరిశ్చంద్రప్రసాద్, స్వామి, శ్రావణమాసం’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈయన కుమారులైన జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
కానీ హరికృష్ణ అనూహ్యంగా ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా, అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే నేడు ఈ హీరో 6వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికన ఘన నివాళులర్పించారు. ‘నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నిండైన ఆత్మీయత కు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, మంత్రి గా, శాసన సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం’ అని సీఎం రాసుకొచ్చారు.
అలాగే చంద్రబాబు కొడుకు-కోడలు (నారా లోకేశ్-బ్రహ్మణి) కూడా దివంగత హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకున్నారు.‘మా అందరినీ ప్రేమగా పిలిచే పెదనాన్న, తాత తరువాత నాన్నకు ముందు హిందూపురం ఎమ్మెల్యేగా చేసిన సేవలు మరిచిపోలేనివి. చిత్ర రంగంలో ఆయన వేసిన పాత్రలు చిరస్మరణీయం. హరికృష్ణ పెదనాన్నకు నివాళి. అంటూ నారా బ్రహ్మణి.. హరి మామయ్యా మీరు మాకు దూరమైనా.. జ్ఞాపకమై మా మధ్య జీవించే ఉంటారు. సినీ, రాజకీయ రంగాలకు మీరు అందించిన సేవలు చిరస్మరణీయం. వర్ధంతి సందర్భంగా మీ స్మృతిలో నివాళులర్పిస్తున్నాను. అంటూ నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికన నివాళులు అర్పించారు.