CM Chandrababu: విద్యుద్ఘాత ప్రమాదంపై సీఎం విచారం.. పరిహారం ప్రకటన
ఉండ్రాజవరం ఘటనలో నలుగురు యువకులు మరణించడంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో.. ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మరణించిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విచారం వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) సైతం దిగ్భ్రాంతి చెందారు. విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఇలాంటి ఘటన జరగడం విషాదకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. యువకుల అకాల మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలన్నారు. అలాగే తణుకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని హోంమంత్రి వైద్యాధికారుల్ని ఆదేశించారు.