Polavaram Project: కేంద్రం కీలక ప్రకటన.. చంద్రబాబు హర్షం
పోలవరం పూర్తిపై కేంద్రం చేసిన ప్రకటనపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు...
దిశ, వెబ్ డెస్క్: కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ఏపీకి జీవనాడి అయిన పోలవరం విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. పోలవరం పూర్తి సహకరిస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పుడు ఆ దిశగా అలోచనలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి రూ. 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించిన మంత్రులు.. పోలవరం పూర్తి కావాల్సిన నిధుల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు ఏపీ, పోలవరం విషయంలో చొరవ చూపాలని నిర్ణయించారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చిలోపు పోలవరాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన షెడ్యల్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పోలవరానికి రూ. 12, 127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.