'వారాహి ఆగదు.. యువగళం ఆగదు'.. Cm jaganపై Lokesh తీవ్ర విమర్శలు
వారాహి ఆగదని, యువగళం ఆగదని నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు....
- మమ్మల్ని మీరు ఆపలేరు
- అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం
- జీవో నెం.1ని మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో!
- మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశా
- మైసూర్ బోండాలో మైసూరు ఉండదు
- జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఉండవు
- యూత్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొస్తాం
- డైమండ్ రాణి అంటూ రోజాపై సెటైర్లు
దిశ,డైనమిక్ బ్యూరో : వారాహి ఆగదని, యువగళం ఆగదని నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. యువత తరఫున పోరాడేందుకే యువగళమని.. తమను ఆపలేరని, అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతామని లోకేశ్ హెచ్చరించారు. 'భయం అనేది నా బయోడేటాలో లేదు. నాలో మానవత్వం ఉంది. మంచితనం ఉంది. మంచి కోసం పోరాడే దమ్ముంది. మనమే కాదు... ప్రజల పక్షాన పోరాడుతున్న పవన్ కల్యాణ్‌ను కూడా బయటికి అడుగుపెట్టకూడదని జీవోలు తీసుకువచ్చాడు. పవన్ కల్యాణ్ పర్యటనల కోసం తయారు చేయించుకున్న వారాహి వాహనానికి ఏపీలో అనుమతులు ఇవ్వరంట. ఏ1 సైకోరెడ్డికి ఒకటే చెబుతున్నా.... నీ జీవో నెం.1ని మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో!.' అని నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'రాష్ట్రాభివృద్ధి చేసిన హక్కుతో పాదయాత్ర చేస్తున్నా. ఇసుకేస్తే రాలనంత జనం హాజరవుతున్నారు. తెలుగుదేశం కంచుకోట కుప్పం. యువగళం..మన గళం..ప్రజాబలం. అన్న ఎన్టీఆర్‌ది చైతన్యరథం..చంద్రన్నది వస్తున్నా మీ కోసం.. మనది యువగళం' అని లోకేశ్ ప్రకటించారు. యువగళం పేరు ప్రకటించగానే వైసీపీ నేతల ప్యాంట్లు తడిశాయని విమర్శించారు. 'మంత్రిగా పని చేసినప్పుడు 25 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించాను. 25 లక్షల వీధి దీపాలు వేయించాను. ఐటీలో నలభై వేల మందికి ఉద్యోగాలు కల్పించాను. ఎలక్ట్రానిక్స్ రంగంలో 40 వేల ఉద్యోగాలు కల్పించింది నేనే. మూడుశాఖల మంత్రిగా చేసిన అభివృద్ధి హక్కుతో పాదయాత్ర చేస్తున్నాను' అని లోకేశ్ పాదయాత్ర చేసేందుకు అర్హత ఏంటన్న వాళ్లకు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఏం పీకారని లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ మంత్రుల్లా వీధుల్లో డ్యాన్సులు వేస్తే పరిశ్రమలు రావని.. కేసీనోలు నడిపితే పరిశ్రమలు రావని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని సీఎం జగన్ 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని లోకేశ్ ధ్వజమెత్తారు. ' ప్రభుత్వ అవినీతిపై మాట్లాడితే కేసులు- ఉద్యమిస్తే జైలు. రాష్ట్రం పరిస్థితిపై యువత ఆందోళనలు చూశాక వచ్చిన ఆలోచనే యువగళం. ప్రభుత్వ అరాచకాలు, అవినీతిపై పోరాడే యువతకు యువగళం ఓ వేదిక కాబోతుంది' అని లోకేశ్ పేర్కొన్నారు.
చీర, గాజులు పంపు డైమండ్ రాణి
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాపై లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'మాట్లాడితే నాకు చీర,గాజులు పంపుతామని ఓ డైమండ్ అంటున్నారు. మహిళా మంత్రి అయి ఉండి, మహిళల్ని కించపరిచేలా ఏంటా మాటలని ప్రశ్నించారు. 'తల్లీ నీ దృష్టిలో చీర కట్టుకుని, గాజులు వేసుకునే మహిళలు చేతకానోళ్లా?. చీర, గాజులు పంపించండమ్మా. మా అక్కాచెల్లెళ్లకు అవి కానుకగా ఇచ్చి వారి కాళ్లు మొక్కుతా'. అని లోకేశ్ ఎద్దేవా చేశారు. అంతేగానీ మీ నాయకుడిలా తల్లి, చెల్లిని మెడపట్టి బయటకి పంపేసేవాడిని కాదని ఎద్దేవా చేశారు. 'రూపాయి రూపాయి కూడబెట్టుకున్న మహిళల్ని సొమ్ము గుంజేసుకున్నాడు జాదూరెడ్డి. పదిరూపాయలిచ్చి...బాదుడే బాదుడుతో వంద దోచేస్తున్నాడమ్మా.' అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం పథకాలపై జగన్ ఫోటో వేసుకుంటాడు కానీ పెంచిన కరెంట్, చెత్తపన్ను, జే బ్రాండ్స్ మద్యంపై ఎందుకు ఫోటో వేసుకోరని లోకేశ్ ప్రశ్నించారు. 'త్వరలో చంద్రన్న వస్తాడు. పెంచిన పన్నులు, ధరలు తగ్గిస్తాడు' అని లోకేశ్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో రైతు రాజ్యం చేస్తానని చెప్పిన సీఎం జగన్ నేడు రైతుల్లేని రాజ్యం చేశాడని లోకేశ్ మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి బిగిస్తున్నాడని.. వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక కార్యాచరణ ద్వారా కౌలు రైతులను ఆదుకుంటాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హామీ ఇచ్చారు.
జగన్ అంటే జాదూ రెడ్డి
'జగన్ మోహన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి గుర్తొస్తాడు. మైసూర్ బోండాలో మైసూరు ఉండదు. జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఉండవు' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ప్రతీ గడప ఎక్కి 2.30 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన జాదూరెడ్డి ఏమైంది నీ హామీ? అని ప్రశ్నించారు. ప్రతీ ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది జాదూ రెడ్డి? అని నిలదీశారు. 'మెగా డీఎస్సీ అన్నాడు..దగా చేశాడు. అధికారం వచ్చాక ఉద్యోగాలు రాలేదనే నిరాశతో 300 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు.' అని లోకేశ్ ధ్వజమెత్తారు. మరోవైపు జే ట్యాక్స్ కోసం వేధింపులు తీవ్రం కావడంతో ప్రముఖ సంస్థలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని లోకేశ్ ఆరోపించారు. ప్రజాధనం తీసుకునే జీతగాడు సజ్జల అమరరాజా పోలేదు, మేమే పంపేశామని గొప్పగా చెప్పుకోవడం మన దౌర్భాగ్యమన్నారు. పరిశ్రమలన్నీ బై బై ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తరలిపోతున్నాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకహోదా వస్తే ఉద్యోగాల వర్షం కురుస్తుందని మాయమాటలు చెప్పాడు జాదూ రెడ్డి అని లోకేశ్ విమర్శించారు. ఏమైంది ప్రత్యేక హోదా? అని నిలదీశారు. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతానని..కేసుల కోసం జగనే మెడ వంచేశాడని విమర్శించారు. జగన్ కేసుల వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోల్పోయిందని లోకేశ్ ఆరోపించారు.మరోవైపు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు అని నారా లోకేశ్ గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది అని నిరూపించారన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు అంటూ ఒక్క పరిశ్రమా తేలేదని, ఒక్క ఇటుకా పెట్టలేదని లోకేశ్ విమర్శించారు.
ఉద్యోగాల కల్పన ప్రణాళికతో టీడీపీ మేనిఫెస్టో
త్వరలో తెలుగుదేశం పార్టీ యూత్ మేనిఫెస్టో తీసుకొస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఒక్క పేజీలోనే యువత కోసం తాము ఏం చేస్తామనేది చెబుతామని వివరణ ఇచ్చారు. ఏ ఉద్యోగాలు, ఎన్ని తీస్తామో ముందే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, స్వయంఉపాధి కల్పనావకాశాలు, ప్రయివేటు రంగంలో కల్పించే ఉద్యోగాలు తెలియజేస్తామన్నారు. అలాగే ప్రతీ సంవత్సరం డీఎస్సీ భర్తీ ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. అలాగే వలసల నివారణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
జగన్.. బుల్లెట్ లేని గన్
మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు వస్తానన్న జగన్ ది తుస్ తుస్ గన్ అని లోకేశ్ విమర్శించారు. సౌండ్ ఎక్కువ పని తక్కువ అని ఎద్దేవా చేశారు. పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళని కిరాతకంగా చంపేస్తే న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఎమ్మిగనూరులో ముస్లిం సోదరి హజీరాని చంపేస్తే ఏమైంది జగన్ గన్?. స్నేహలత, గాయత్రి, తేజస్విని,అనూష, వరలక్ష్మితోపాటు 900 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం స్పందించలేదు. 21 రోజుల్లో రేప్ నిందితులకు ఉరి వేస్తామంటూ దిశ చట్టం తెచ్చానని శాసనసభలో ప్రకటించాడు జాదూ రెడ్డి. ఏమైందయ్యా నీ దిశచట్టం, 900 మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో ఎంతమందిని 21 రోజుల్లో శిక్షించావో చెప్పు జాదూ రెడ్డి?. అని నారా లోకేశ్ ప్రశ్నించారు.