Tirutpati: ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు ‘మహాశాంతి’ హోమం
తిరుమల ఘాట్‌రోడ్లపై ప్రమాదాల నివారణకు మహాశాంతి హోమం నిర్వహించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు...
దిశ, తిరుపతి: తిరుమల ఘాట్‌రోడ్లపై ప్రమాదాల నివారణకు మహాశాంతి హోమం నిర్వహించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. డౌన్‌ఘాట్ రోడ్డు ఏడో మైలు ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జరిగిన మహాశాంతి హోమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా, మరికొన్ని ప్రమాదాలు జరిగాయన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులకు పెద్దగా గాయాలు లేకుండా బయటపడ్డారని తెలిపారు. ఈ ఘటనల అనంతరం ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించామని చెప్పారు. అదే సమయంలో భక్తుల భద్రత కోసం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు సూచించారని ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తిరుమల ఘాట్ రోడ్లలో దుర్ఘటనలు జరగకుండా ప్రసన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో మహాశాంతి హోమం నిర్వహించామని ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ ఆపదలు, భయాందోళనలు, అంటువ్యాధులు మొదలైన అశుభాలు కలిగినప్పుడు వైఖానస భగవత్ శాస్త్రంలో మహాశాంతి హోమం నిర్వహించడం గురించి తాము పేర్కొన్నట్లు తెలిపారు. ఈ హోమం నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆపదలు కలుగకుండా నివారణ చేయవచ్చన్నారు.