TTD:జూన్ 29 నుండి తిరుపతిలో చతుర్వేద హవనం
లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు జేఈవో సదా భార్గవి చెప్పారు.
దిశ, తిరుపతి: లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు జేఈవో సదా భార్గవి చెప్పారు. మంగళవారం జేఈవో అధికారులతో కలిసి పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమాన్ని టీటీడీ గతంలో విశాఖపట్నం,కోవూరులో నిర్వహించినట్లు తెలిపారు. తిరుపతిలో మొదటిసారిగా 7 రోజులపాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇందులో వేదాల ప్రాముఖ్యత, వేదాలు ఎలా ఉద్భవించాయి, వేదాల విశిష్టత, వేదాలు ప్రపంచానికి ఏ విధంగా మేలు చేస్తాయనే అంశాలపై ప్రముఖ పండితులతో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
చతుర్వేద హవనంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుండి 32 మంది రుత్వికులు ఈ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. మైదానాన్ని ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఉదయం హోమ కార్యక్రమాలు, సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, తరిగొండ వెంగమాంబ చరిత్ర ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు వీక్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు.ఈ కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, సిఏఓ శేష శైలేంద్ర, సిఈ నాగేశ్వరరావు, విజిఓ మనోహర్, గోశాల డైరెక్టర్ డా.హరినాథ రెడ్డి, పిఆర్ఓ డా.రవి, డిపిపి ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాల రావు, డి పిపి కార్యదర్శి శ్రీనివాసులు ,అదనపు ఆరోగ్యాధికారి డా . సునీల్, ఈఈ ప్రసాద్, డిఈ (ఎలక్ట్రికల్ ) సరస్వతి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.