Chittoor: మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఘోరం.. నలుగురు దుర్మరణం

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందారు....

Update: 2023-04-16 12:43 GMT

దిశా,డైనమిక్ బ్యూరో: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ పరిధి కొత్తపల్లి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు చెందిన పెనమాల లక్ష్మమ్మ (65) పక్షవాతంతో బాధపడుతుంది. రోజు రోజుకు ఆమె పరిస్థితి విషమిస్తోంది. కన్న తల్లి బాధను చూసి భరించలేకపోయిన తనయుడు నర్సయ్య(41) వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి తీసుకువెళ్లాలని భావించి కారులో బయలుదేరారు. తల్లి లక్ష్మమ్మ, బంధువు చిన్నక్క (60), బాలుడు హర్షవర్దన్‌తో కలిసి నర్సయ్య కారులో బయలుదేరారు.

కొత్తపల్లి క్రాస్ వద్ద ప్రమాదం

చిత్తూరు-కడప జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు రామాపురం మండలం నల్లగుట్టపల్లి సమీపంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మమ్మ, ఆమె కుమారుడు నర్సయ్య (41), కారు డ్రైవర్ రాజారెడ్డి (35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంధువు అయిన చిన్నక్క (60) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. వీరందరినీ కడప రిమ్స్‌కు తరలించారు. మరో కారులో ఉన్న ముగ్గురితోపాటు బాలుడు హర్షవర్ధన్ గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాయచోటి డీఎస్పీ శ్రీధర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. తల్లికి మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకెళ్తూ తల్లితోపాటు తనయుడు మరో ఇద్దరు మృతి చెందడంతో బద్వేలులో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి : Big Breaking: ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం

Tags:    

Similar News