Congress: కాపులు, దళితులకు బంపర్ ఆఫర్.. దెబ్బతో పగ్గాలు ఖాయమట!

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు...

Update: 2023-05-15 14:33 GMT

దిశ, తిరుపతి: కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. తిరుపతిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన సభ జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... 2024లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు. బలిజ, కాపులు, దళితులు కలసికట్టుగా అధికారాన్ని పంచుకుందామని చింతా పిలుపు నిచ్చారు. కాపు, బలిజలకు రెండున్నర సంవత్సరం, దళితులకు మరో రెండున్నర సంవత్సరం ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఆయన కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే బాధ్యత తనదే అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగి పోయిందని, ఈ నేపధ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. ఒక ఫ్లోర్‌కు రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.


కార్పొరేషన్ పరిధిలో 800 మంది కార్మికులు పని చేస్తుంటే, అందులో సుమారు 300 మంది కార్మికులను అధికారులు తమ ఇళ్లలో పనికి వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధర్మంగా వ్యవహరిస్తోందని చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, రుయా,7 యూనివర్సిటీలలో పని చేసే కార్మికులకు 20 వేల వేతనం ప్రతినెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పిసిసి కార్యదర్శి యార్లపల్లి గోపి గౌడ్, తిరుపతి జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు రవి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూతలపట్టు ప్రభాకర్, మించల తేజోవతి, శాంతి యాదవ్, సుబ్బలక్ష్మి, ముని శోభ, రావణ్, సమీర్ ఉల్లా, వెంకటేష్ గౌడ్, మహేష్ రాయల్, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News