Vande Bharat Expressపై రాళ్ల దాడి.. పోలీసుల అదుపులో అనుమానితులు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై దాడులు కలకలం రేపుతున్నాయి. ...
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై దాడులు కలకలం రేపుతున్నాయి. దేశంలోనే అత్యంత వేగగామి ట్రైన్‌గా పేరుగాంచిన వందేభారత్ రైళ్లపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే విశాఖపట్టణంలో రాళ్ల దాడి ఘటన మరవకముందే వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరగడం కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు తిరుపతి జిల్లా గూడూరుకు చేరుకుంది. గురువారం మధ్యాహ్నాం గూడూరు మండలం కొండగుంట రైల్వేస్టేషన్ దాటే సమయంలో రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. కానీ గ్లాస్ ధ్వంసం అయ్యింది. దీంతో రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ సందీప్ వెల్లడించారు. ఎందుకు రాళ్ల దాడికి పాల్పడాల్సి వచ్చింది అనేదానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.