మత ఛాందసానికి అమెరికానే ప్రేరణ

America is inspiration To religious doctrine

Update: 2023-12-12 14:10 GMT

తిరుపతి ప్రపంచంలో మత ఛాందసానికి ప్రేరణ అమెరికానేనని, ఇజ్రాయిల్‌ను అడ్డం పెట్టుకుని మధ్య ఆసియాను అదుపులోకి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. తిరుపతి లోని గందమనేని వెంకటశివయ్య భవనంలో సోమవారం సాయంత్రం అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘పాలస్తీనా స్వేచ్ఛ కోసం గళమెత్తుదాం’ వ్యాస సంకలనం ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. వియత్నాం యుద్ధంలో ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత ఉచిత విద్య పేరుతో అమెరికా వెనుకబడిన దేశాల్లో ఇస్లాం చాందసాన్ని పెంచి పోషించిందని, పవిత్ర యుద్ధం అన్న అర్థం వచ్చే ‘జిహాది’ పదానికి అర్థాన్ని మార్చేసిందని చెపుతూ, పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడి వెనుక అమెరికా కుట్రను వివరించారు.

భయపెడుతున్న పాలస్తీనా యుద్ధ దృశ్యాలు

‘పాలస్తీనా స్వేచ్ఛ కోసం గళమెత్తుదాం’ వ్యాస సంకలనాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ ఆవిష్కరించి ప్రసంగించారు. పొద్దున్నే నిద్ర లేవగానే పాలస్తీనా యుద్ధ దృశ్యాలు భయపెడుతున్నాయని, నిద్రపోతే అవే దృశ్యాలు కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనాపై గాంధీ, నెహ్రూలతో పాటు నార్ల వెంకటేశ్వరరావు, బాలగోపాల్, ప్రకాష్ కారత్ వంటి మహామహులు రాసిన చక్కని వ్యాసాలు ఈ సంకలనంలో ఉన్నాయని గుర్తు చేశారు. తొలి నుంచి పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలిచిన భారత పాలకులు 1990ల నుంచి ఇజ్రాయిల్ వైపు మొగ్గు చూపడం మొదలైందన్నారు. మతం ప్రాతిపదికపైన ప్రజలను విభజించే ఉన్మాదం పాలకుల్లో పెరిగిపోవడం వల్లనే ఇజ్రాయిల్ వైపు మొగ్గు చూపిందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తాను ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో ఇజ్రాయిల్ వ్యవసాయం పేరుతో రైతుల కొంపముంచారని ఆరోపించారు. కోట్ల రూపాయలు తీసుకుని ఇజ్రాయిల్ కంపెనీ ఉడాయించడంతోపాటు కుప్పం రైతులు కుప్పకూలిపోయారని పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌తో సంబంధాలు పెట్టుకున్న మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుని వాటిని కాశ్మీర్, మధ్య భారతం, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అణచి వేయడానికి ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇజ్రాయిల్ నుంచి పెగాసెస్ స్పైవేర్‌ను దిగుమతి చేసుకుని, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావుల సెల్ఫోన్లలోకి పంపించి, రాజ్యాంగం కల్పించిన గోప్యత హక్కును దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఘీభావంగా అంతా నిలవాలని పిలుపునిచ్చారు.

నరమేధంలో మనమూ భాగస్వాములమే

ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశంలో ఫ్యాసిస్టు తరహా ప్రభుత్వం నడుస్తోందని, మతం పేరుతో జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు. పాలస్తీనాలో జరుగుతున్న నరమేధాన్ని ఖండించకపోతే మనం కూడా ఆ నరమేధంలో భాగస్వాములయనట్టేనని హెచ్చరించారు. అభ్యుదయ వేదిక జిల్లా అధ్యక్షులు గురవయ్య అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేణుక, వేదిక జిల్లా కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కవి, రచయిత డాక్టర్ నెమిలేటి కిట్టన్న, అరసం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు సాకం నాగరాజులతో పాటు పలువురు పుర ప్రముఖులు సభకు హాజరయ్యారు.

Tags:    

Similar News