చంద్రబాబు బయటకొస్తారు.. ఇక వైసీపీకీ ఏడుపులే: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని వైసీపీ అగ్రనేతలు తట్టుకోలేకపోతున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Update: 2023-11-21 13:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని వైసీపీ అగ్రనేతలు తట్టుకోలేకపోతున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల కంటే జగన్ సొంత పత్రికలో రాసిన రాతలు రోతగా ఉన్నాయని విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బెయిల్ విషయంలో న్యాయ వర్గాల్లో విస్మయం అని రాశారని..ఇష్టానుసారంగా రాస్తే ఎలా అంటూ మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా కేసు వస్తే ఒక రకంగా, లేదంటే మరో రకంగా పత్రికల్లో రాయిస్తారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు గతంలో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినప్పుడు స్వాగతించిన వైసీపీ నేతలు ఇప్పుడు బెయిల్ ఇస్తే ఎందుకు ఏడుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని ఇక రాబోయే రోజుల్లో వైసీపీకి అన్ని ఏడుపులు ఉంటాయని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏపీలో దొంగఓట్ల లొల్లి ఢిల్లీకి చేరిందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఓట్లు తీసేస్తున్నారని రఘురామ ఆరోపించారు. వలంటిరీ వ్యవస్థ ద్వారా ఎవరు వైసీపీకి ఓటు వేయరో తెలుసుకుని వారి ఓట్లు అన్యాయంగా తొలగిస్తున్నారని.. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని సైతం వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు.

Tags:    

Similar News