అమిత్ షా, మోడీతో చంద్రబాబు భేటీ.. తెలంగాణ ఎన్నికల్లో సహాకారం కోసమేనా?

బీజేపీ కేంద్ర పెద్దల నుంచి చంద్రబాబుకు పిలుపొచ్చింది. శనివారం రాత్రి అమిత్​ షాతో మాట్లాడారు. నేటి ఉదయం ప్రధాని మోడీతో భేటీ అవుతున్నారు. తెలంగాణలో టీడీపీ సహకారం అవసరమని బీజేపీ భావిస్తోంది. దీని గురించి చర్చించేందుకే

Update: 2023-06-04 03:28 GMT

బీజేపీ కేంద్ర పెద్దల నుంచి చంద్రబాబుకు పిలుపొచ్చింది. శనివారం రాత్రి అమిత్​ షాతో మాట్లాడారు. నేటి ఉదయం ప్రధాని మోడీతో భేటీ అవుతున్నారు. తెలంగాణలో టీడీపీ సహకారం అవసరమని బీజేపీ భావిస్తోంది. దీని గురించి చర్చించేందుకే బాబును పిలిపించినట్లు తెలుస్తోంది. పనిలోపనిగా ఆంధ్రాలో పొత్తులు గురించి కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఇచ్చినా సరే కీలకమైన 8 ఎంపీ స్థానాలను బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం. దీనిపై బాబు మల్లగుల్లాలు పడుతున్నారు. అంగీకరించినా క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ అంత తేలిక్కాదు. ప్రజల్లో బీజేపీ మీద వ్యతిరేకత ఎక్కడ కొంప ముంచుతుందోనన్న బెంగ మరోవైపు బాబును సందిగ్దంలోకి నెడుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య కమలనాథు లతో బాబు భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో : తెలంగాణకు జనవరి 16న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు తేదీలను ఖరారు చేసింది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకుంది. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు సహకారంతోనైనా టీఆర్​ఎస్​ను ఢీ కొట్టాలని బీజేపీ యోచిస్తోంది. దీనికితోడు చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు, జనసేనాని పవన్​ కల్యాణ్​ పొత్తు కుదిర్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లనే విషయంలో ఇప్పటిదాకా ఓ కొలిక్కి రాలేదు.

ఆ 8 ఎంపీ స్థానాలు అడుగుతున్న బీజేపీ..

రాష్ట్రంలో ఎన్ని శాసన సభ సీట్లు ఇచ్చినా పర్వాలేదు.. కీలకమైన 8 పార్లమెంటు స్థానాలు కావాలని బీజేపీ నుంచి ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటిదాకా చంద్రబాబు ఓ నిర్ణయానికి రాలేదు. విశాఖ, అమలాపురం, నర్సాపురం, విజయవాడ, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలపై కాషాయ పార్టీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ, విజయవాడలో టీడీపీ సత్తా చాటింది. బీజేపీ కోరుతున్న అన్ని స్థానాల్లోనూ నాడు టీడీపీ వైసీపీని బలంగా ఢీ కొట్టింది. ఇలాంటి చోట్ల పార్టీకి చోటులేకుండా చేస్తే భవిష్యత్తులో టీడీపీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందువల్లే బీజేపీ ప్రతిపాదనపై స్పందించకుండా చంద్రబాబు ఇప్పటిదాకా వెనకాడుతూ వచ్చారు.

అందుకే ఏపీపై బీజేపీ దృష్టి..

కర్నాటకలో బీజేపీ చావుదెబ్బ తినింది. అటు ఈశాన్యంలోనూ వ్యతిరేక సెగకు హిమాచల్​ ప్రదేశ్​ను వదులుకోవాల్సి వచ్చింది. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మసకబారినట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్​లో కూడా కాషాయపార్టీకి ఈసారి ఎదురుగాలి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాదిన ఏదోరకంగా పాగా వేస్తే తప్ప నష్టాన్ని పూడ్చుకోలేమని కమలనాథులు భావిస్తున్నారు. అందువల్లే తెలంగాణ, ఏపీలో అవకాశాలపై దృష్టి పెట్టింది. చంద్రబాబును మరింత డిఫెన్స్​లోకి నెట్టేందుకు ఇటీవల జగన్​ సర్కారుకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు సంకేతాలిచ్చింది. రెవెన్యూ లోటు గ్రాంటు దగ్గర నుంచి పోలవరానికీ నిధులు ఇస్తామంటూ ప్రచారంలో పెట్టింది.

చంద్రబాబును వీడని ఆందోళన..

వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ మనుగడ కష్టమవుతుంది. అందుకే విజయం కోసం చంద్రబాబు దేనికైనా సిద్ధపడతారని కమలనాథులు గ్రహించారు. ఇదే సరైన సమయం అనుకొని పావులు కదిపినట్లు తెలుస్తోంది. బీజేపీ అడిగినన్ని ఎంపీ సీట్లు ఇచ్చినా ఓట్ల బదలాయింపు అంత తేలిక్కాదు. ఇక్కడ కాషాయ పార్టీపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి హోదా, విభజన హామీలు నెరవేర్చకుండా ద్రోహం చేసిన పార్టీగా ముద్ర పడి ఉంది. వైసీపీ, బీజేపీ ఒకటేనన్న ప్రచారంతోనే గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీపై వ్యతిరేకత తమ కొంప ముంచుతుందనే ఆందోళన బాబును పట్టిపీడిస్తూనే ఉంది. ఒకవేళ వాళ్లు అడిగినన్ని ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించినా తర్వాత టీడీపీకి భవిష్యత్​ లేకుండా పోతుందనే భయం కూడా వెంటాడుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Tags:    

Similar News