మదనపల్లె ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. వెలుగులోకి సంచలన విషయాలు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఫైళ్లు దగ్ధం కావడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు..
దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్ధం అయ్యాయి. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఘటనపై సీరియస్ అయ్యారు. వెంటనే అధికారులకు ఫోన్ చేశారు. కానీ అధికారులు స్పందించలేదు. దీంతో సీఎం చంద్రబాబు మరింత ఆగ్రహానికి గురయ్యారు. రాత్రి సమయం, ఆదివారం కావడంతో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ప్రభుత్వం ఉద్యోగి ఎందుకు ఉన్నారని చంద్రబాబు ఆరా తీశారు.
గతంలో పీసీపీ ఫైల్స్, గనుల శాఖకు సంబంధించిన డాక్యుమెంట్లు దగ్ధం అయిన నేపథ్యంలో ఈ ఘటనను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఫైళ్లు ఎలా దగ్ధమయ్యాయని, కుట్రకోణం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టాలని ఏపీ డీజీపీతో పాటు సీఐడీని అదేశించారు. కొందరు అధికారులు ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానాల నేపథ్యంలో విచారణ చేపట్టి వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవరమైతే జాగిలాలను వినియోగించాలని సూచించారు. ఈ ఘటనతో ఏపీ డీజీపీ తిరుమలరావు, సీఐడీ చీఫ్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు.