ఏపీలో భూ సంస్కరణలు.. కీలక కమిటీలు నియామకం
ఏపీలో భూ సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భూ సంస్కరణలు(Land reforms) చేపట్టేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భూ సంస్కరణల కోసం అసైన్‌మెంట్ కమిటీ(Assignment Committee)లను నియమించింది. జిల్లా ఇంచార్జి మంత్రి చైర్మన్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. స్థానిక ఎమ్మెల్యే, జేసీ, ఆర్డీవో ఈ కమిటీలో సభ్యులుగా పని చేయనున్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానిక ఎమ్మెల్సీ సైతం ఉంటారు. ఈ కమిటీ ద్వారా ప్రభుత్వ భూమిని గుర్తించి పేదలకు పంచాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అంతేకాదు జిల్లాలో నెలకొన్న భూ సమస్యలను ఈ కమిటీల ద్వారా పరిష్కారం చూపున్నారు.
కాగా గత ప్రభుత్వ హయాంలో భారీగా భూ ఆక్రమణలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ నేతల కనుసనల్లోనే అక్రమాలు జరిగినట్లు టీడీపీ(Tdp) నాయకులు అప్పట్లో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారం మారడంతో కూటమి ప్రభుత్వం భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కమిటీలు నియమించి జగన్(Jagan) ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాలను వెలికి తీయాలని నిర్ణయించింది. ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం సైతం భేటీ అయింది. పేదలు నివాసించే ఇళ్లపై వారికే హక్కు కల్పించాలని నిర్ణయించింది. 22ఏలోని భూముల అభ్యంతరాలపై చర్యలు తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అసైన్ మెంట్, దేవాలయ, వక్ఫ్ భూముల్లో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించింది. అన్ని సరళీకృతం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా కమిటీలు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.