ఏపీకి చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. కలవనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాత్రే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చేరుకుంది.
దిశ వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాత్రే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చేరుకుంది. ఈ బృందంలో ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారులున్నారు. కాగా ఈ బృందం ఏపీలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు పర్యటనలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనున్నారు.
అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అలానే తామిచ్చిన ఫిర్యాదుపై సీఈవో ఎంకే మీనా ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తున్న టీడీపీ.. ఈ విషయాన్ని సైతం సీఈసీ ముందుకు పెట్టనున్నారు. అలానే సచివాలయ సిబ్బంది జగన్ తరుపున ప్రచారంలో పాల్గొంటున్న నేపధ్యలో సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని.. ఇక అధికారులు, పోలీసుల బదిలీల విషయం లోనూ ఎన్నికల సంఘం నిబంధనలను పట్టించుకోవడం లేదని సీఈసీ ఫిర్యాదు చేయనున్నారు.