చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని శ్రీవారి సాక్షిగా చెప్పగలరా?: నారా భువనేశ్వరికి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదని తిరుమల వేదికగా నారా భువనేశ్వరి చెప్పగలరా..? అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చాలెంజ్ చేశారు.

Update: 2023-10-25 11:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదని తిరుమల వేదికగా నారా భువనేశ్వరి చెప్పగలరా..? అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చాలెంజ్ చేశారు. శ్మశానం వద్ద కూర్చొని, ఎవరు చనిపోయినా వాళ్లు చంద్రబాబు కోసమే చనిపోయారని టీడీపీ వాళ్లు లెక్కలు రాసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో టీడీపీకి సానుకూల వాతావరణం లేదని అన్నారు. టీడీపీ పిలుపునకు ప్రజల నుంచి స్పందన కరువైందని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. స్కిల్‌ స్కామ్‌లో అన్ని ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసి జైల్లో పెట్టిందని అన్నారు. స్కిల్ స్కాం కేసులో సూత్రధారి చంద్రబాబు నాయుడు కాబట్టే న్యాయస్థానం రిమాండ్ విధించిందని అన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. చంద్రబాబుకి పవన్‌ కల్యాణ్‌ దత్తపుత్రుడు అని తాము మెుదటి నుంచి చెప్పామని వెల్లంపల్లి అన్నారు. పవన్‌ స్వలాభం కోసం దేనికైనా సిద్ధమవుతాడని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం, జనసేన కలిసి ఎక్కడ ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా ఒరిగేదేమీ ఉండదని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పవన్, చంద్రబాబు, లోకేష్‌ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Tags:    

Similar News