Chandrababu Naidu : చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీలో సీ ఓటర్ సర్వే.. ఊహించని ఫలితాలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఏపీలో సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ఇవాళ సీ ఓటర్ సంస్థ అధికారికంగా విడుదల చేయగా.. ఇందులో పలు విషయాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ వల్ల ఆయనకు ప్రజల్లో బాగా సింపతీ పెరిగిందని, దీని వల్ల టీడీపి గ్రాఫ్ భారీగా పెరిగినట్లు స్పష్టం చేసింది. అరెస్ట్ వల్ల చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని 56 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఈ సర్వేలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వైసీపీ మద్దతుదారుల్లో కూడా చంద్రబాబు పట్ల సానుకూలత వచ్చినట్లు సీ ఓటర్ తెలిపింది. అరెస్ట్ వల్ల చంద్రబాబుకే మేలు జరుగుతుందని 64 శాతం మంది వైసీపీ మద్దతుదారులు అబిప్రాయం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ మద్దతుదారుల్లో 85 శాతం, బీజేపీ మద్దతుదారుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు అరెస్ట్ పరిణామాలు బాబుకే కలిసొస్తాయని అభిప్రాయపడ్డారు.
కేవలం 36 శాతం మంది వైసీపీ మద్దతుదారులు మాత్రమే జగన్‌కు చంద్రబాబు అరెస్ట్ కలిసొస్తుందని చెప్పినట్లు సీ ఓటర్ అంచనా వేసింది. జగన్ అభద్రతాభవానికి గురవుతున్నారా? అని ప్రశ్నించగా.. 58 శాతం మంది అవునని, 30 శాతం మంది కాదని తెలిపారు. ఇక 12 శాతం మంది సమాధానం చెప్పలేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రోజు నుంచి సీ ఓటర్ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వాటిని విశ్లేషించగా.. చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని అంచనా వేసింది.