‘రాయలసీమను విడదీసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు’
రాయలసీమను తెలంగాణలో కలపాలని సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి కొత్త అంశం తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమను తెలంగాణలో కలపాలని సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి కొత్త అంశం తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. రాయలసీమను తెలంగాణలో కలపాలని, అపుడే సీమలో సాగునీటి సమస్య తీరుతుందని జేసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, తన వంతుగా ప్రజలను కూడగడతానని చెప్పారు. ఈ క్రమంలో రాయలసీమను విడదీసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జేసీకి పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. రాయల తెలంగాణ డిమాండ్‌ను తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
మరో జన్మ అంటూ ఉంటే రాయలసీమలోనే పుట్టాలని కోరుకుంటా అని అభిప్రాయపడ్డారు. అంతేగాక, రాయలసీమ అభివృద్ధిపై కేంద్రానికి, ప్రధాని మోడీకి ఎన్నో లేఖలు రాశామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కర్ణాటక తరహాలో రాయలసీమను అభివృద్ధి చేయాలని తెలిపినా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. బ్రిటీష్ వారు కట్టించిన హౌస్పేట్ డ్యామ్‌ను అప్పర్ భద్రతో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం బాధాకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాయలసీమకు తీవ్ర అన్యాయాన్ని చేస్తున్నాయని మండిపడ్డారు.