దూరం పెట్టిన ప్రియుడు... యాసిడ్ పోసి ప్రతీకారం తీర్చుకున్న ప్రియురాలు

ఆమెకు పెళ్లైంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటుంది.

Update: 2023-10-04 05:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆమెకు పెళ్లైంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఇంతలో ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. యువకుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఆమె ప్రియుడి కుటుంబ సభ్యులపై పోలీస్ కేసు పెట్టింది. తన ప్రియుడు తనను ఇక దగ్గరకు చేర్చుకోడని ఆమె భావించింది. అంతే అతడిపై కక్ష పెంచుకుంది. పోలీసు కేసు విచారణ జరుగుతుండగానే ప్రియుడిపై యాసిడ్ పోసి హత్యాయత్నాని ఒడిగట్టింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేసిన యువకుడిపై ఓ మహిళ యాసిడ్ తో దాడి చేసింది. దీంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తోటలో పరిచయం

గుంటూరు పట్టణంలో ఓర్పు వెంకటేశ్ అనే యువకుడు ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. ప్రతీరోజూ వాటర్ ప్లాంట్‌ నుంచి వాటర్‌ను వ్యాన్‌లో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌కు రామిరెడ్డితోటలో నివసించే రాధ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. రాధ స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా ప్రాంతం. రాధకు గతంలోనే పెళ్లైంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటూ జీవనోపాధి కోసం పలు ఇళ్లలో పని చేస్తూ ఉంటుంది. వెంకటేశ్, రాధల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో రాధను వెంకటేశ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే కొన్నిరోజులపాటు ఇద్దరూ అక్కడే ఉన్నారు. అయితే వెంకటేశ్ కుటుంబ సభ్యులు ఈ బంధాన్ని అంగీకరించలేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని రాధాను కోరారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడు వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులు తనను కొట్టి, ఇంటి నుంచి గెంటేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రియుడు వెంకటేశ్‌తోపాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు.

కక్షతో యాసిడ్ దాడి

రాధ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకటేశ్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. రామిరెడ్డి తోటవైపు వెళ్లడం కూడా మానేశాడు. ప్రియుడు వెంకటేశ్‌తో మాట్లాడేందుకు రాధ పలుమార్లు ప్రయత్నించింది. అయితే అందుకు వెంకటేశ్ నిరాకరించాడు. దీంత ప్రియుడు తనను దూరం పెట్టాడని ఇక తనకు దక్కడని భావించింది. దీంతో వెంకటేశ్‌పై కక్ష పెంచుకుంది. అంతే మంగళవారం తెలిసిన ముగ్గురు యువకులను తీసుకుని ఆటోలో వెంకటేశ్ పనిచేస్తున్న వాటర్ ప్లాంట్ దగ్గరకు వెళ్లింది. అక్కడ లేకపోవడంతో ఆటోలో వెంకటేశ్ వాటర్ క్యాన్‌లు వేస్తున్న ప్రాంతానికి వెళ్లింది.వెంకటేశ్ వాటర్ క్యాన్ లు దించుతున్న సమయంలో వెనకాల నుంచి యాసిడ్ పోసి దాడికి పాల్పడింది. అనంతరం అదే ఆటోలో అక్కడ నుంచి పరారైంది. యాసిడ్ దాడితో తీవ్ర గాయాలు పాలైన వెంకటేశ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బాధితుడు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు రాధ, అలాగే ఆమెకు సహాయం చేసిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News