గ్రామ సచివాలయం గదుల్లో దర్శనమిచ్చిన బీర్ సీసాలు.. ఎమ్మెల్యే ఆగ్రహం

అవనిగడ్డలో గ్రామ సచివాలయం-1 కార్యాలయం గదుల్లోనే మద్యం సేవిస్తున్నారు. కార్యాలయం గదుల్లో, మెట్లపై ఎటు చూసినా తాగి పడేసిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయి.

Update: 2024-12-19 13:54 GMT

దిశ ప్రతినిధి,కృష్ణాజిల్లా: అవనిగడ్డలో గ్రామ సచివాలయం-1 కార్యాలయం గదుల్లోనే మద్యం సేవిస్తున్నారు. కార్యాలయం గదుల్లో, మెట్లపై ఎటు చూసినా తాగి పడేసిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. గురువారం రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక పరిశీలన చేయగా ఈ పరిస్థితి దర్శనమిచ్చింది. గ్రామ సచివాలయంలో ఎటు చూసినా మద్యం సీసాలు కనిపించడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.

కార్యాలయం గదుల్లో కూడా మద్యం సీసాలు కనిపించడంతో ఇదేమిటని ప్రశ్నించారు. గ్రామ సచివాలయంలోనే మద్యం తాగుతుంటే ఏం చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శి అనితను ప్రశ్నించారు. బయటి వారు రాత్రివేళల్లో వచ్చేస్తున్నారని ఆమె తెలిపారు. ఇతరులు లోపలికి రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ భవనం, గదులు తీవ్ర అపరిశుభ్రతగా ఉండటాన్ని పరిశీలించారు. తక్షణమే కార్యాలయం మొత్తం శుభ్రం చేయించాలని, మద్యం తాగే వాళ్ళు లోపలికి రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Similar News