తిరుపతి వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రైళ్ల సమయం మార్పు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాది మంది తెలుగు భక్తులు వెళ్తున్నారు. ,,,
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాది మంది తెలుగు భక్తులు వెళ్తున్నారు. దీంతో తిరుపతి వైపు రైళ్లన్ని ఫుల్లుగా ఉంటాయి. ఈ మేరకు జనరల్‌లో వెళ్లడం కంటే రిజర్వేషన్‌తో ప్రయాణం చేయడమే బెటర్ అని ప్రయాణికులు భావిస్తుంటారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లే భక్తులు ఈ సాయంత్రం రైలు ఎక్కితే తెల్లవారే సరికి తిరుపతికి చేరుకోవాలని అనుకుంటారు. ఈ మేరకు టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణం చేస్తుంటారు. అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి రూట్‌లో వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1 నుంచి నారాయణాద్రి, పద్మావతి ఎక్స్ ప్రెస్, సింహపూరి (గూడూరు వరకు) రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది.
సికింద్రాబాద్ టు తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలు సాయంత్రం 6.25కు బదులు 5.30 గంటలకు బయలు దేరనుంది. తిరుపతికి ఉదయం 7 గంటలకు బదులు 5.55కే చేరనుంది. ప్రయాణ సమయం 12.35 గంటల నుంచి 12.25కు తగ్గనుంది. సికింద్రాబాదు నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు సమయం గూడూరు స్టేషన్ నుంచి మారనుంది. గూడూరుకు ఈ రైలు తెల్లవారు జామున 4.43కు బదులుగా 4.19 గంటలకే చేరుకుంటుంది. తిరుపతి స్టేషన్‌కు 6.55కే వెళ్తుంది. సికింద్రాబాద్ టు గూడూరు వెళ్లే సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 11.05కు బదులుగా 10.05కే బయలు దేరుతుంది. విజయవాడకు తెల్లవారు జామున 3.35కే చేరుకుంటుంది. తిరుపతికి 8.55కే చేరుతుంది. ఈ మూడు రైళ్లే కాదు నర్సాపూర్ టు మహారాష్ట్ర వెళ్లే సాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ రైలు సమయంలో మార్పులు చేశారు. రాత్రి 9.50కు బయల్దేరి ఉదయం 7.30కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ప్రయాణికులు జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.