కాయ్ రాజా కాయ్.. పులివెందుల నుంచి పిఠాపురందాకా..!

ఏపీ ఎన్నికల్లో విజయంపై కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి..

Update: 2024-05-18 03:01 GMT

దిశ, ప్రతినిధి కడప: పులివెందుల నుంచి పిఠాపురం దాకా, షర్మిల నుంచి చంద్రబాబు దాకా, అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటముల నుంచి మెజార్టీ దాకా, దేనికైనా సై అంటున్నారు పందెం రాయుళ్లు . ఎన్నికల ఫలితాలు మెజార్టీలపై ఉమ్మడి కడప జిల్లాలో కాయ్ రాజా కాయంటూ జోరుగా పందాలు కాస్తున్నారు. ఒకటికి ఒకటి, ఒకటి రెండు లెక్కన లక్షల్లో పందేలు కుదుర్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా కుదుర్చుకుంటున్న బెట్టింగ్ కోట్లలో జరుగుతోంది. పందేలు కాసే బెట్టింగ్ రాయుళ్ళు ఒప్పందాలు కుదర్చుకునే ముందు ఆయా నియోజకవర్గాల ఓటింగ్ సరళిపై క్షేత్రస్థాయిలో రకరకాలగా పోలింగ్ సరళిని తెలుసుకోవడంలో తలమునకలైతున్నారు. పోలింగ్ సరళిని అంచనాలు వేసే రాజకీయ పరిశీలకంటే‌ పందెం రాయుళ్లే ఎక్కువగా పోలింగ్‌పై సర్వే చేస్తున్నారు. ఆమేరకు బెట్టింగ్ జోరు సాగిస్తున్నారు.

దేనికైనా రెడీ

భారీ ఎత్తున జరుగుతున్న బెట్టింగ్‌లో దేనికైనా రెడీ అంటున్నారు పందెం రాయుళ్లు. ఏ ప్రభుత్వం వస్తుంది?, ఎన్ని సీట్లు వస్తాయి?, కడప పార్లమెంటు‌లో ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మెజార్టీ ఎంత, ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలకు కుప్పం, పులివెందులలో ఎవరికి మెజార్టీ ఎంత?, షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయి ఇలా రకరకాల పందేలకు సిద్ధమంటున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏర్పడబోతుందన్న దానిపై ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారు‌ జగన్మోహన్ రెడ్డి కి 100 సీట్లు వరకు వస్తాయని కొందరు ,ప్రభుత్వం ఏర్పాటుకు మాత్రమే కొందరు బెట్టింగ్ కాస్తుంటే, ఆ మేరకు సీట్లు రావని కొందరు, 90కి మించి రావాలని కొందరు, అసలు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు కూడా రావని కొందరు ఇలా బెట్టింగ్ కాస్తున్నారు .ఒకరు ప్రభుత్వం వస్తే ఒక రూపాయికి రూపాయి పందెం కాస్తుండగా ,మరికొందరు ప్రభుత్వం వస్తే మీరు రూపాయి ఇవ్వండి, రాకపోతే మేము రెండు రూపాయలు ఇస్తామంటూ అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం రెండు వైపులా ఎవరి అంచనాలను బట్టి వారు పందెం కాస్తున్నారు. కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం . ప్రభుత్వంతోపాటు పులివెందులలో జగన్ మెజార్టీ మీద , కడప పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్లపైనా పందాలు కాస్తున్నారు. వీటితో పాటు కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో భారీ మొత్తంలో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ నాలుగు చోట్ల అంచనాలకు అందని పోటీ జరగడంతో ఇక్కడ పందేలకు ఎక్కువ బెట్టింగ్ సాగుతోంది.

పిఠాపురం, మంగళగిరిపై ..

ఉమ్మడి కడప జిల్లాలోని కడప, రాయచోటి ,పొద్దుటూరు, జమ్మలమడుగు , పులివెందుల ప్రాంతాల్లో కొందరు జిల్లా దాటి బయట నియోజకవర్గాల పైనా కూడా పందేలు కాస్తున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు,ఓటమి, మెజార్టీ లపై కొందరు పందాలు కాస్తున్నారు. అలాగే నగిరి లో రోజా ఓడిపోతుందని పందెం కాస్తుండగా,గెలుపుపై నా కొందరు బెట్టింగ్ కాస్తున్నారు.మంగళగిరిలో నారా లోకేష్ గెలుపొటములపై కూడా జిల్లాలో పందేలు జోరుగా జరుగుతున్నాయి. నగిరి లో రోజా ఓడిపోతుందని వంద రూపాయలు ఇస్తాము గెలుస్తామనే వారు 70 రూపాయలు ఇవ్వండి చాలు అంటూ పందేలు కాస్తున్నట్లు సమాచారం . అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజార్టీ పైన జిల్లాలో బెట్టింగ్ జరుగుతుంది .ఇలా జిల్లాలోని అసెంబ్లీ ,పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు బయట ప్రాంతాలపైనా బెట్టింగ్ జరగడం చూస్తే జిల్లాలో ఏ స్థాయిలో బెట్టింగ్ సాగుతుందో ఊహించవచ్చు. అలాగే కడప జిల్లాలో జరిగిన ఎన్నికల ఫలితాలపై హైదరాబాదు ,కోస్తా ప్రాంతాల నుంచి కూడా కొందరు పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది .కడప జిల్లా లో పొద్దుటూరు , జమ్మలమడుల తో పాటు మరికొన్ని ప్రాంతాలు క్రికెట్ బెట్టింగ్ కు పెట్టింది పేరుగా మారింది.ఆ బెట్టింగులు ఇప్పుడు ఎన్నికల్లో సీట్లు ఎవరికి కేటాయిస్తారు అనే దగ్గర నుంచి , గెలుపోటములు మెజార్టీలు దాకా జోరుగా సాగుతోంది. ఇలా కోట్లలో బెట్టింగ్ కుదుర్చుకుంటున్న పందెం రాయుళ్లలో జూన్ 4న ఎవరు మునుగుతారో ఎవరు తేలుతారో అని నరాలు తెగే ఉత్కంఠ తో గడపాల్సిందే..


Similar News