ప్రియురాలి కోసం మారు వేషం.. ప్లాన్ బెడిసికొట్టి స్థానికులకు చిక్కిన వైనం
ప్రియురాలితో కలిసి సన్నిహితంగా మాట్లాడేందుకు ఓ యువకుడు మారువేషం వేశాడు.
దిశ,పల్నాడు:ప్రియురాలితో కలిసి సన్నిహితంగా మాట్లాడేందుకు ఓ యువకుడు మారువేషం వేశాడు. అచ్చం ముస్లిం యువతిలా బురఖా వేసుకున్నాడు. లేడీస్ చెప్పులు ధరించి బయటకు వచ్చాడు. రోడ్డుపై హడావుడిగా నడిచి వెళ్తుంటే నడకలో తేడాను గమనించిన స్థానికులు ఆ యువకుడిని వెంబడించారు. చివరకు క్రోసూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తచ్చాడుతున్న ఆ యువకుడి స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన గంగాధర్ రెడ్డి అనే యువకుడు అచ్చంపేట మండలం వేల్పూరు కోళ్ళ ఫారంలో పని చేస్తున్నాడు. అక్కడ పనిలో పరిచయం అయిన ఓ యువతితో సన్నిహితంగా ఉంటున్నారు. యువతి అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రికి వచ్చి ఆమెను పలకరించాలని అనుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండాలని బురఖా వేషం ధరించాడు. అయితే ఆస్పత్రికి వెళ్లే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్ళబోయి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. చివరికి ఎరక్కపోయి వచ్చి స్థానికులకు చిక్కి పోయాడు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మందలించి పంపించారు.