బాలకృష్ణా!టీడీపీ పగ్గాలు తీసుకోండి..ఆ పార్టీలో మీసాలు తిప్పండి : మంత్రి అంబటి రాంబాబు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసాలు తిప్పాల్సింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Update: 2023-09-22 05:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసాలు తిప్పాల్సింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇదే సరైన అవకాశం... నందమూరి వంశం ప్రతాపాన్ని చూపండి అంటూ సెటైర్లు వేశారు. ‘ముందు మీ పార్టీలో మీసాలు తిప్పండి బాలకృష్ణా..! మీ తండ్రి వెన్నులో దించిన కత్తి పట్టుకుని కదలండి. మీ తండ్రి వెన్నుపోటులో మీపై ఉన్న అపవాదును తుడుచుకోండి. బావ జైల్లో, అల్లుడు ఢిల్లీలో ఉన్నారు..పార్టీ పగ్గాలు చేపట్టండి అంటూ’ మంత్రి అంబటి రాంబాబు సలహా ఇచ్చారు. చంద్రబాబు నిప్పు అనే నమ్మకం మీకుంటే చర్చకు రండి అని సవాల్ విసిరారు. టీడీపీకి కావాల్సింది చర్చ కాదు.. రచ్చ. చర్చకు మేం సిద్ధం అంటుంటే ఈ రాద్ధాంతం ఏమిటి..? అని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..చంద్రబాబు అరెస్ట్, అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.‘మీసాలు తిప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. ముందుగా బాలకృష్ణ మీసాలు టీడీపీలో తిప్పాలి. ఇప్పటికైనా మీ తండ్రి నందమూరి తారకరామారావు వెన్నులో దించిన కత్తి తీసుకుని బయటకు రండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మీకు ఒక మంచి అవకాశం. మీ నాన్న పెట్టిన పార్టీని బతికించుకునేందుకు ఇదొక మంచి అవకాశం అన్నారు. జన్మనిచ్చిన తండ్రికి క్లిష్ట సమయంలో మీరు సహాయం చేయలేదనే అపవాదు ఉంది. ఆ అపవాదును తుడిచివేసే మహత్తర అవకాశం బాలకృష్ణకు వచ్చింది అంటూ మంత్రి అంబటి రాంబాబు హితబోధ చేశారు.

నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండి

నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండి అంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి అంబటి రాంబాబు సూచించారు. ఈ అవకాశంతో పోయిన పార్టీ పగ్గాలు మళ్లీ తీసుకోండి అని సలహా ఇచ్చారు. మీ పార్టీని బతికించుకోండి. అలా బతికించుకోడానికి ఇదొక చక్కని అవకాశం. మీ నాన్న పెట్టిన పార్టీని బతికించుకునే చక్కని అవకాశం, మీపై పడిన మచ్చను మాపుకునే అవకాశం. మీరు సమర్ధులే..అయితే ఆ పని చేయండి అని బాలకృష్ణకు సూచించారు. మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.మీ బావగారు ముఖ్యమంత్రిగా చేశారు.. ఒక సారి ఓడిపోయాడు. మీ అల్లుడు అసలు ఎక్కడా గెలవకుండానే మంత్రిగా చేశాడు. మీరు రెండు సార్లు గెలిచినా మంత్రిగా చేయలేకపోయారు. మీ అన్న హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చినా తర్వాత తీసి పక్కన పెట్టాడు.ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మీ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. మీకు నాయకత్వ లక్షణాలున్నాయి...అలా అని శాసన సభలో కాదు మీసం తిప్పాల్సింది..మీ పార్టీలో తిప్పండి. మా వ్యతిరేక పార్టీ అయినా సరే ఒక సూచన, సలహా ఇస్తున్నా అంటూ అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

 స్పీకర్‌పై దాడికి ప్రయత్నించారు

అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణకు స్పీకర్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు అని మత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘చంద్రబాబును అరెస్ట్‌ చేశారు కాబట్టి ఏదో ఒక గొడవ చేయాలని టీడీపీ సభ్యులు సభకు వస్తున్నారు అని మండిపడ్డారు. పేపర్లు చించేసి, పోడియంపై ఉన్న మానిటర్‌ను పీకేశారు...స్పీకర్‌పై దాడి చేయాలనే పథకంతో వచ్చారు. ఒకవేళ అరెస్ట్‌ అయితే.. ఆ తర్వాత స్పీకర్‌పై దాడి చేసిన తెలుగుదేశం అని ఎల్లో మీడియాలో బ్యానర్ వార్తల కోసం వారు తాపత్రయ పడ్డారు. చర్చకు మేం అంగీకరించిన తర్వాత ఎందుకు గొడవ అనేది ప్రజలు కూడా ఆలోచించాలి’ అని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.

Read More..

చంద్రబాబు సీటు పైకెక్కి బాలయ్య విజిల్.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం..!  

Tags:    

Similar News