అన్నప్రసాదంపై కొందరు దుష్ప్రచారం..నాణ్యతలో రాజీపడం: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమలకు ప్రతి రోజు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమలకు ప్రతి రోజు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలలో మంగళవారం భూమన మీడియాతో మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాదాపు 700 మంది ఉన్నహాల్‌లో కేవలం 15 మంది మాత్రమే భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రెచ్చ కోట్టేవిధంగా మాట్లాడటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు. ఇప్పటి వరకు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందన్నారు. స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సంయమనంతో ఉండాలని సూచించారు. అన్నప్రసాదంలో ఏదైన పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.