బర్రెలక్క సోదరుడిపై దాడి బాధాకరం..ఆమెకు రక్షణ కల్పించండి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమయం సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమయం సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సూర్యాపేటలో బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌పై దాడి మరువకముందే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీష సోదరుడిపై దాడి కలకలం రేపుతోంది. శిరీష సోదరుడిపై దాడిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. శిరీష సోదరుడిపై దాడి చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శిరీష, ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి, సిఈవో తెలంగాణను కోరుతూ ట్యాగ్ చేశారు.
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న శిరీష
ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా శిరీష బరిలోకి నిలిచింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న శిరీష ఇప్పుడు ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బర్రెలక్కకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి యువత తరలివస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా పలువురు ఎన్నికల ప్రచారానికి ఖర్చులు సైతం పంపుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో శిరీష మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమె సోదరుడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. బర్రెలక్కకు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నవారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఉలిక్కిపడ్డ శిరీష తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ నిలదీసింది. సోదరుడిపై దాడిని తలచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని.. కానీ తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని బర్రెలక్క ఆవేదన వ్యక్తం చేసింది. బర్రెలక్కకు భద్రతకు కల్పించాలంటూ ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాడులు చేసి బెదిరిస్తారా? అని నిలదీశారు.