మీరేమైనా సీబీఐ చీఫా?.. మీడియాపై తమ్మినేని సీతారాం సీరియస్
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుందని స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుందని స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రపై మీడియా అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుంది. నీకు, నాకు పనేంటి అంటూ మీడియాపై స్పీకర్ తమ్మినేని సీతారాం చిర్రుబుర్రులాడారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉంటే సీబీఐ తేలుస్తుందని మీడియాకు చెప్పాలా అని నిలదీశారు. మీరేమైనా సీబీఐ చీఫా? అంటూ మీడియా ప్రతినిధులపై తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జునస్వామిని కుటుంబ సమేతంగా స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు.
స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్‌కు భాష మాట్లాడటమే చేతకాదని స్పీకర్ తమ్మినేని విమర్శించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉందో లేదో జగన్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాలను గెలుస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం ధీమా వ్యక్తం చేశారు. క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.