సీఎం జగన్ ఆస్తులు రూ.4లక్షల కోట్లా?: వివరాలు బయటపెట్టిన అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ సభకు వెళ్లినా ‘తాను అత్యంత పేదవాడిని’ అని మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ సభకు వెళ్లినా ‘తాను అత్యంత పేదవాడిని’ అని మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 20 ఏళ్ల క్రితంపేదవాడిగా ఉన్న వైఎస్ఆర్, జగన్ నేడు కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. 2003లో వైఎస్ఆర్ కుటుంబం కడు పేదదని..2003లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఐటీ రిటర్న్ చూస్తే అర్థమౌతుందన్నారు. జగన్ అన్ని దుర్మార్గాలు చేసి ఈ స్థాయికి వచ్చాడని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 2003లో వైఎస్ కుటుంబ ఐటీ రిటర్న్స్ ప్రకారం ఆస్తి రూ.9,19,951 మాత్రమే. అధికారంలోకి వచ్చాక ప్రజానీకానికి సేవ చేయాలిగానీ.. జగన్ లాగ మోసం చేయకూడదు అని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ సంక్షేమం కోసం పనిచేయాలి గాని సంక్షోభం సృష్టించకూడదు. ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోరాలి. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి, తన అధికారాన్ని ఉపయోగించుకొని కోట్లు వెనకేసుకున్నారు. జగన్ అవినీతిని చట్టబద్దత చేస్తూ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో జగన్ కోట్లాది రూపాయలు దిగమింగారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
పంచభూతాలను వదలడం లేదు
నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో జగన్, జగన్ కుటుంబం, శ్రేయోభిలాషులు దోచుకున్నదానిపై హైకోర్టులో పిల్ వేస్తే హైకోర్టు నోటీసులు ఇస్తే కనీసం దానిపై సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వైసీపీకి లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘పదేళ్లుగా జగన్ బెయిల్ పై తిరుగుతున్నారు. కోర్టుకు వెళ్లకుండా వ్యవస్థలను మెనేజ్ చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అరాచకాలు జరుగుతున్నాయి, ఇసుక, మద్యం దోపిడీ యదేచ్ఛకగా జగన్ అస్మదీయ సంస్థలకు చెందిన కాంట్రాక్టులు ఇచ్చారు. కాంట్రాక్టులన్నీ జగన్ సొంత మనుషులకిచ్చారు. అడిగే నాధుడు లేడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. రాష్ట్రంలో పంచభూతాలను కూడా వదలలేదు. ప్రకృతి సంపద అయిన ల్యాండ్, శాండ్, మైన్ లను కొల్లగొడుతున్నారు’ అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.అక్రమ కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రితో సహ నిందితుడు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు రాష్ట్రంలో పడి దోచుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్విట్ ప్రోకో విధానం ద్వారా దోచుకుంటున్నారు. విశాఖపట్నం భూములు యదేచ్ఛగా దోచుకుంటున్నారు. బే పార్కు ఇలా దేన్నీ వదలడంలేదు. దేశంలోనే అత్యంత అవినీతి అనకొండగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తయారయ్యాడు అని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేదం చేస్తానని చెప్పి అమలు చేయలేదు. మద్యం లిక్కర్ తయారీ కంపెనీలను సొంత సంస్థలుగా మార్చుకుని జగనే తయారు చేసి వైసీపీ నాయకులే అమ్ముతున్నారు. మద్యం దోపిడి యదేచ్ఛగా సాగుతోంది అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి నేడు రూ.4 లక్షల కోట్లకు పైగా ఆస్తికి యజమానిగా అమాంతం ఎలా ఎగబాకారు? అని నిలదీశారు. బహిరంగంగా 16 కంపెనీలకు, రహస్యంగా 50కి పైగా సూట్ కేసు కంపెనీలకు, వేలాది ఎకరాల భూములకు, 9 నగరాల్లో అధునాతనమైన ప్యాలెస్‌కు అధిపతి ఎలా అయ్యాడు? అని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్ష కోట్లు దోచుకున్న వైనంపై జరిగిన సీబీఐ, ఈడీ తదితర సంస్థల విచారణలో జగన్ రెడ్డిపై 38కేసులు నమోదయ్యాయని వీటన్నింటిపై సీఎం వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు నిలదీశారు.