అరసున్నా-అరసున్నా కలిసినట్లుంది:పవన్-లోకేశ్‌ల భేటీపై మంత్రి ఆర్‌కే రోజా సెటైర్లు
తెలుగుదేశం,జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి భేటీపై మంత్రి ఆర్‌కే రోజా సెటైర్లు వేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం,జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి భేటీపై మంత్రి ఆర్‌కే రోజా సెటైర్లు వేశారు. తిరుమల శ్రీవారిని మంగళవారం దర్శించుకున్న మంత్రి ఆర్‌కే రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. సమన్వయ కమిటీ సమావేశం చూస్తుంటే ఏదో పాడుతా తీయగా సెలక్షన్ జరుగుతున్నట్లు అనిపించిందని అన్నారు. అసలు అది సమన్వయ కమిటీ సమావేశం మాదిరిగా లేదని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ టీం ఒకవైపు, నారా లోకేశ్ టీం ఒకవైపు కూర్చుని టీం సెలక్షన్ జరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అరసున్నా, అరసున్నా కూర్చోని లోపల ఉన్న గుండు సున్నా కోసం సమావేశంలో చర్చించారని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం దిశానిర్దేశం చేసేందుకే తాము సమావేశమయ్యామని ఇరు పార్టీల నేతలు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. మరోవైపు నారా భువనేశ్వరి చేపట్టబోయే నిజం గెలవాలి కార్యక్రమంపైనా మంత్రి ఆర్‌కే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. స్కిల్ స్కాం కేసులో నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేశ్, భువనేశ్వరి సైతం జీవితాంతం జైల్లు ఉండే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని అన్నారు. నిజం గెలవాలని మనస్ఫూర్తిగా నారా భువనేశ్వరి భావిస్తే స్కిల్ స్కాంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని మంత్రి ఆర్‌కే రోజా డిమాండ్ చేశారు.