ఆ ఉద్యోగ నోటిఫికేషన్ ఫేక్.. ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ 2023’పేరుతో వాట్సాప్‌లో హల్ చల్ చేస్తున్న వార్త ఫేక్ అని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
దిశ, డైనమిక్ బ్యూరో : 'ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ 2023'పేరుతో వాట్సాప్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వరలో ఆర్టీసీ లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయని, ముందుగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని అందుకు కొంత మొత్తం చెల్లించాలని తెలుపుతూ వాట్సాప్‌లో చాలా మందికి మెసేజెస్ వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఫేక్ న్యూస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాల ప్రకటన ఏదీ ఆర్టీసీ విడుదల చేయలేదని ఎవరో మోసాలకు పాల్పడుతూ ఇలా చేసి ఉంటారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
గతంలో ఇలాగే కొందరు ఫేక్ మెయిల్స్ ద్వారా చాలామందిని మోసం చేసే చర్యలకు పాల్పడ్డారని, ఇపుడు సోషల్ మీడియా ద్వారా చాలా సులభంగా ఇటువంటి తప్పుడు వార్తలను వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతున్నారని ఆర్టీసీ ఓ ప్రకటనలో ఆరోపించింది. అభ్యర్ధులు ముందుగానే ఫీజు చెల్లించాలని, దానితో పాటు ఆధార్ కార్డులు, బ్యాంకు ఓటీపీ తదితర వివరాలన్నీ అందులో తెలిపాలని సూచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. మీ వివరాలన్నీ సేకరించిన తర్వాత సైబర్ మోసాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ కోరింది. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.