Ap News: పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీ రియాక్షన్ ఇదే..

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీ స్పందించింది...

Update: 2024-06-26 16:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రక్రియ సందర్భంగా పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు దాడులు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి బీభత్సం సృష్టించారు. అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఆయన ఎన్నికల అధికారులను దుర్భాషలాడటమే కాకుండా ఈవీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్లపై దాడులకు దిగారు.  ఈ ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి.. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ గడువు ముగియడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించిన ఎంతటి వారికైనా శిక్ష తప్పదని హెచ్చరించింది. పిన్నెల్లి అరెస్టే ఇందుకు నిదర్శమని తెలిపింది. ఎన్నికల్లో దుశ్చర్యలకు పాల్పడకుండా పిన్నెల్లి అరెస్ట్ ఒక గుణపాఠం అని స్పష్టం చేసింది. పిన్నెల్లి అరెస్ట్‌తో ఈవీఎం ధ్వంసం ఘటనకు ముగింపు లభించిందని పేర్కొంది. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఈ అరెస్ట్ స్పష్టం చేసిందని ఈసీ వెల్లడించింది. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వ్యక్తులకు కఠిన శిక్షలు తప్పవని ఈసీ హెచ్చరించింది.

Similar News