ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం జగన్.. తాజా పరిణామాలతో పార్టీ క్యాడర్ సైతం బేజారు!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
కోడి కత్తి కేసు విచారణను ఎన్ఐఏ కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌కోసం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ రెండు కేసులపై దర్యాప్తులు వైసీపీ క్యాడర్ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేట్లున్నాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను దీటుగా ఎదుర్కొనే పరిస్థితులు కనిపించడం లేదు. తాజా పరిణామాలపై సీఎం జగన్‌తో పాటు కీలక నేతలూ కలవర పడుతున్నారు. ఒకవేళ అవినాశ్ రెడ్డి అరెస్టయితే తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. వివేకా హత్య, కోడి కత్తి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అవినాశ్ రెడ్డి అరెస్టును ఆపేందుకు కేంద్ర పెద్దలు సీఎం జగన్‌కు సహకరిస్తారా ? అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో సీబీఐ ముందుకు వెళ్తుందా అనే అంశాలపైనే ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. పులివెందుల నుంచి అవినాశ్హైదరాబాద్ ప్రయాణించినప్పుడు ఆయనతోపాటు పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా ఉన్నారట. కేసు విషయమై చర్చించినట్లు సమాచారం. ఈ క్లిష్ట సమయంలో ఎలా ముందుకు పోవాలనే అంశంపై సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళవారం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఎలా తీర్పునిస్తుంది.. ఒకవేళ సీబీఐ అరెస్టు చేస్తే ఏం చెయ్యాలనే దానిపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇది వైఎస్సార్ కుటుంబ ప్రతిష్టకు సంబంధించిన అంశం. సీబీఐ అరెస్టుల తర్వాత సీబీఐ దర్యాప్తు ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చించారట. ఈ పరిణామాలన్నీ పార్టీ యంత్రాంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.. తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూలంకషంగా సీఎం జగన్మాట్లాడినట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
అవినాశ్ అరెస్టయితే వైసీపీకి ఇక్కట్లే..
కోడి కత్తి కేసు విషయంలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చింది. ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తానే ఈ నాటకం ఆడినట్లు నిందితుడు శ్రీను చెప్పాడు. అసలు ఇదంతా సానుభూతి కోసం జగనే నాటకానికి శ్రీకారం చుట్టినట్లు శ్రీను చెప్పి ఉంటే అధికారం కోసం ఇంత బరితెగిస్తారా అని జనం విస్తుపోయేవారు. ఆ ప్రమాదం నుంచి పార్టీ బయటపడింది. వివేకా హత్య కేసు నుంచి బయటపడడం అంత తేలిక్కాదు. అవతల వివేకా కుమార్తె సునీత మరింత పట్టుదలతో ఉన్నారు. చివరకు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాశ్ అరెస్టు అయితే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని విశ్లేషకుల అంచనా.
అరెస్టయినా.. కాకున్నా..
అవినాశ్ అరెస్టు అవుతారా లేదా అనే చర్చతో రాష్ట్రంలోని అన్ని అంశాలూ దారి మళ్లాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకీరణ, కార్మికుల ఆందోళన, బీఆర్ఎస్మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల ప్రతిస్పందనలన్నీ పక్కకు పోయాయి. వివేకా హత్య కేసుపై సామాజిక మాధ్యమాల్లో విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు వైసీపీ సోషల్ మీడియా దీటుగా స్పందించలేకపోతోంది. వైసీపీ, బీజేపీ రహస్య బంధానికి గండిపడిందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ అవినాశ్ అరెస్టు కాకుంటే బీజేపీతో వైసీపీ బంధం మరింత బలపడిందనే విమర్శలనూ ఎదుర్కోక తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈపాటికే సీఎం జగన్ ఉక్కిరి బిక్కిరవుతూ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. రేపటి నుంచి బయటకొస్తే పార్టీ నేతలకు ఏం చెబుతారు.. పార్టీ క్యాడర్‌కు ఏం నిర్దేశిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి: జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు కొలిక్కి వచ్చేనా!?