నేటి నుంచి మరో 2 కొత్త విమాన సర్వీసులు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గత 6 నెలల్లోనే గణనీయంగా పెరిగిన విమాన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా కొత్త సర్వీసులు రాబోతున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త సర్వీసులు ప్రారంభం కాగా తాజాగా రాష్ట్రానికి మరో 2 కొత్త సర్వీసులు మంజూరయ్యాయి.
దిశ, న్యూఢిల్లీ/ఏపీ బ్యూరో: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గత 6 నెలల్లోనే గణనీయంగా పెరిగిన విమాన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా కొత్త సర్వీసులు రాబోతున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త సర్వీసులు ప్రారంభం కాగా తాజాగా రాష్ట్రానికి మరో 2 కొత్త సర్వీసులు మంజూరయ్యాయి. రాజమండ్రి - ముంబై - రాజమండ్రి(6ఈ 582/3), తిరుపతి - ముంబై - తిరుపతి(6ఈ 532/3) మధ్య డిసెంబర్ 2 నుంచి కొత్తగా విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
రాజమండ్రి - ముంబై - రాజమండ్రి విమానం ప్రతి రోజూ సాయంత్రం 4.50 గంటలకు ముంబైలో బయలుదేరి 6.45 గంటలకు రాజమండ్రి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.15 గంటలకు ప్రారంభమై, 9.05 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. మరో విమానం ఉదయం 5.30 గంటలకు ముంబైలో ప్రారంభమై, 7.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి 7.45 గంటలకు ప్రారంభమై, 9.25 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఈ 2 నగరాల నుంచి ముంబై చేరుకోవాల్సి వస్తే.. హైదరాబాద్ మీదుగా చేరుకోవాల్సి ఉండేది. తాజా సర్వీసులతో ప్రయాణ సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.