వైసీపీకి మరో ఎమ్మెల్సీ దూరం.. త్వరలో జనసేనలో చేరిక..?
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేన లో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు.
దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేన లో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అనంతరం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉండగానే గత ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందే దళిత యువకుడి శిరోముండనం కేసున్నా, జగన్ మండపేట టికెట్ కేటాయించారు. అయినా, తోట త్రిమూర్తులు పరాజయం పాలయ్యాడు.
మూడు పార్టీలు ఒప్పుకుంటేనే..
త్రిమూర్తులుకు దగ్గర బంధువైన సామినేని ఉదయభాను జనసేన వైపు చూడటం తో ఆయన ద్వారా జనసేనలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ అంశాన్ని జనసేన పెద్దల వద్ద సామినేని ఉదయభాను ప్రస్తావించారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అయితే కూటమిలో మూడు పార్టీలకు ఆమోదంతోనే చేర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. పిఠాపురం వరద ముంపు ప్రాంతాల్లో గత వారం వైఎస్ జగన్ పర్యటించినప్పుడు తోట త్రిమూర్తులు దూరంగా ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.