మీసాలు మెలేస్తూ.. తొడలు కొడుతూ CI వీరంగం.. NCWలో వంగలపూడి అనిత ఫిర్యాదు

Update: 2023-02-28 09:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో మహిళలపై పోలీసుల దాడి గురించి జాతీయ మహిళా కమిషన్‌కు తెలుగు మహిళ అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారని.. మహిళలని కూడా చూడకుండా బూతులు తిడుడూ, వారిపై దాడికి పాల్పడుతున్నారు అని ఫిర్యాదులో ఆరోపించారు. గతంలో అమరావతి మహిళలపై సైతం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు అని గుర్తు చేశారు.

పులివెందుల నాగమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే తనపై అట్రాసిటీ కేసు పెట్టారు అని వంగలపూడి అనిత ఆరోపించారు. తాజాగా కదిరిలో పోలీస్ ఇన్స్పెక్టర్ మధు మహిళలపై దాడికి పాల్పడ్డాడు అని ఫిర్యాదు చేశారు. ఈ నెల 25న కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వీధులు వెడల్పు చేస్తున్న పేరుతో రెవెన్యూ అధికారులు అక్కడున్న షాపులను ధ్వంసం చేశారు.

ఆ నేపధ్యంలో షాపు యజమానులు మరి కొంతమంది నిరసన తెలయజేయగా ఇన్స్పెక్టర్ మధు వారిని అసభ్యకరంగా బూతులు తిడుతూ సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. దళిత వర్గానికి చెందిన సుధారాణి అనే మాజీ కౌన్సిలర్‌ను అసభ్యకరంగా దూషించాడు. వైసీపీకి చెందిన కొంతమంది గూండాలు రాళ్లు విసరడంతో అనేక మందికి గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ చర్యలకు వ్యతిరేకంగా అదేరోజు సాయంత్రం కొంతమంది మహిళలు ఆయన ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపారు.

ఆ సమయంలో మధు, ఆయన సిబ్బంది మహిళలపై లాఠీచార్జీ చేసి దాడికి పాల్పడ్డారు అని వంగలపూడి అనిత ఆరోపించారు. మధు మీసాలు మెలేస్తూ.. తొడలు కొడుతూ మహిళలను అసభ్యకరంగా దూషించాడు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆడవారు వారు వంటింటికే పరిమితమవ్వాలి.. రోడ్లపైకి రాకూడదంటూ తిట్టాడని.. పోలీసుల దాడిలో అనేకమంది మహిళలు గాయపడి ఆసుపత్రి పాలయ్యారని చెప్పుకొచ్చారు. ఆ సందర్బంలో అక్కడ మహిళా పోలీసులు ఎవరూ లేరు. గంగారత్నమ్మ, ప్రవీణ్ బాబి అనే మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. కమిషన్ వారు ఈ ఘటనపై విచారణ చేసి ఇన్స్పెక్టర్ మధుపై తగు చర్యలు తీసుకోవాలని వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు.

Tags:    

Similar News