ఏపీలో దారుణం.. అప్పు తిరిగివ్వలేదని మహిళను వివస్త్రను చేసి దాడి
తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడం లేదని మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటన ఏపీలో జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తీసుకున్న అప్పు తీర్చలేదన్న కోపంతో వైసీపీ నాయకుడు ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అప్పు తిరిగివ్వలేదని వివస్త్రను చేసి దాడి చేయడమంటే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందించారు. ‘నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్లలో వైసీపీ నేత అచ్చి ప్రభాకర్ అభినవ దుశ్శాసనపర్వంతో మహిళా లోకమంతా అవాక్కయ్యింది. వడ్డిపాలేనికి చెందిన లక్ష్మి అప్పుతీర్చలేదని ఆమె తల్లి అనసూయతోపాటు వచ్చిన మహిళలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడటం దారుణం. వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. వైసీపీ నేతలు దుశ్శాసనుల్లా ఘోరంగా మహిళల్ని అవమానిస్తుంటే, రక్షణగా నిలవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం మన రాష్ట్రంలో అరాచక పరిస్థితులకి అద్దం పడుతోంది. సొంత తల్లి, చెల్లి ప్రాణాలకే ప్రమాదం తలపెట్టిన ముఖ్యమంత్రి పాలనలో సామాన్య మహిళలకి భద్రత దొరుకుతుంది అనుకోవడం భ్రమే’ అంటూ లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి చేయమని వైసీపీ అధిష్టానం చెప్పిందా : జనసేన నేత కిషోర్
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితురాలి అనసూయమ్మను జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మంగళవారం పరామర్శించి ఓదార్చారు.మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణమన్నారు.సర్పంచి తన వాడే అని అహంకారం తో వ్యవహరించిన పెంచలయ్యకు శిక్ష పడే వరకూ బాధితులకు జనసేన తరపున తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. పేదల పట్ల కనికరం లేకుండా దాడి చేయటం అమానవీయమన్నారు. రూ. 10,000 అప్పు తిరిగి ఇవ్వక పోతే ఇలా కొట్టమని మీ వై సీ పీ అధిష్టానం చెప్పిందా అని ప్రశ్నించారు.అది కూడా అక్క బాకీ వుంటే చెల్లిపై దాడి చేయమని చెప్పిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికార మదంతో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
అసలేం జరిగింది?
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వడ్డిపాలేనికి చెందిన అంకమ్మ చిన్న కుమార్తె లక్ష్మి ఏడాది క్రితం వైసీపీ నేతలు అచ్చి ప్రభాకర్, ప్రమీలమ్మ దంపతుల వద్ద రూ.10 వేలు అప్పు తీసుకుంది. అయితే అప్పు వసూలులో భాగంగా వాటర్ ప్లాంట్ వద్దకు రావాలని ఈ నెల 1న లక్ష్మికి ప్రభాకర్ కబురంపాడు. దీంతో ఆమె తన తల్లి అంకమ్మ, అక్క అనసూయమ్మను తోడుగా తీసుకెళ్లింది. అప్పు ఎందుకు తీర్చలేదంటూ స్థానిక సర్పంచ్ భర్త శ్రీకళ పెంచలయ్య ముందే అచ్చి ప్రభాకర్ లక్ష్మిని అసభ్యకరంగా దూషించాడు. దీంతో అక్క అనసూయమ్మ జోక్యం చేసుకుని తిట్టొద్దని వేడుకుంది. దీంతో కోపోద్రిక్తులైన ప్రభాకర్ దంపతులు అనసూయమ్మను వివస్త్రను చేసి దాడి చేశారు. దీనిపై ఆమె పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పెద్దలను సంప్రదించగా గ్రామంలో మీకు ఓట్లు లేవని న్యాయం చేయలేమని పెద్దలు చెప్పడంతో బాధితురాలు అనసూయమ్మ మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం బాధితురాలు నెల్లూరులోని జీజీహెచ్‌లో చికిత్సపొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.