Raghuveera Reddy: అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి
రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్(Ambedkar )పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం ఆక్షేపనీయమని సీనియర్ కాంగ్రెస్ నేత, సీడబ్ల్యుసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera Reddy)తప్పుబట్టారు.
దిశ, వెబ్ డెస్క్ : రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్(Ambedkar )పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం ఆక్షేపనీయమని సీనియర్ కాంగ్రెస్ నేత, సీడబ్ల్యుసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera Reddy)తప్పుబట్టారు. తక్షణం దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ(Apologize)లు చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య భారతదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడేనని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. రాముడు, కృష్ణుడు కూడా మానవ అవతారంలోనే దేవుళ్లుగా కీర్తించబడ్డారన్నారు. మన రాజ్యాంగం దేశ ప్రజల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న పవిత్ర గ్రంథమన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విశిష్ట జ్ఞానాన్ని గుర్తించి రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ బాధ్యతలు అప్పగించి గౌరవించిందని గుర్తు చేశారు.
రాజ్యాంగ దినోత్సం సందర్భంగా పార్లమెంటులో జరిగిన చర్చ దేశ ఔన్నత్యాన్ని పెంచుతుందని, మహాత్మగాంధీ, నెహ్రు, అంబేద్కర్ ల స్ఫూర్తిని నేటి యువతకు అందించే దిశగా సాగుతోందని భావించామని, కాని బీజేపీ, అమిత్ షాలు అందుకు విరుద్ధంగా అంబేద్కర్ ను అవమానించేలా చర్చ జరుపడం శోచనీయమన్నారు. రాముడు, కృష్ణుడు మాదిరిగా అంబేద్కర్, మహాత్మగాంధీ, నెహ్రులు ఖచ్చితంగా ప్రజాస్వామ్య భారత దేశానికి దేవుళ్ల వంటి వారేనన్నారు. ప్రతి రోజు వారిని చిన్నగా చేసే ప్రయత్నాలు బీజేపీ చేయడం సరైంది కాదన్నారు. అన్ని కులాలు, మతాలను ఏకం చేసి 75ఏండ్ల క్రితం ఆ మహానీయులు వేసిన పునాదుల మీదనే ఈ రోజు భారత దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుందని, మీరు ఆ పునాదులనే తీసే ప్రయత్నం చేయడం క్షమార్హం కాదని అమిత్ షా, బీజేపీలను రఘువీరారెడ్డి విమర్శించారు.