మహిళాఅధికారితో సంబంధం అంటూ ఆరోపణలు.. YCP నేత విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: మహిళాఅధికారితో సంబంధం ఉందంటూ తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని.. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్లాన్ ప్రకారమే తనపై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి సీరియస్ అయ్యారు. తన ప్రతిష్టను దిగజార్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా.. ఐదేళ్లకు ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవడం ఖాయమన్నారు.
ఓ ఆదివాసీ మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతయుతమైన ఎంపీగా తాను పని చేస్తుంటే ఓ ఆదివాసీ మహిళతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్స్ తీసుకుంటామన్నారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన మీడియా సంస్థలను వదిలేది లేదన్నారు. యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. కొందరు బరితెగించి తనపై నిరాధరమైన ఆరోపణలు చేశారని.. తనపై కుట్ర చేస్తున్న వాళ్లందరికీ బుద్ధి చెబుతాను అన్నారు. తనపై ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తా అని తెలిపారు. విధి నిర్వహణలో తనను చాలా మంది ప్రజలు, ఆఫీసర్లు కలుస్తారని కలిసినంత మాత్రాన సంబంధం అంటగడతారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.