రాష్ట్రంలో లోన్‌యాప్ మరణాల పాపం జగన్ రెడ్డిదే: Achanta Sunitha

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు.

Update: 2022-09-08 17:08 GMT

దిశ, ఏపీ బ్యూరో : జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఎవరిని అత్యాచారం చేసి చంపేస్తారో, ఎవరిపై అక్రమ కేసులు బనాయిస్తారో, అర్థరాత్రి తలుపు తట్టి దాడులు చేసి అరెస్ట్‌లు చేస్తారో అనే భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైక్రో ఫైనాన్స్ సంస్థలను ప్రోత్సహించి గ్రామీణుల జీవితాలతో ఆడుకున్నారు. నేడు జగన్ రెడ్డి లోన్ యాప్ సంస్థలపై చర్యలు తీసుకోకుండా అమాయక ప్రజల బలవన్మరణాలకు కారణమవుతున్నారు అని అంగన్వాడీ మరియు డ్వాక్రా విభాగాల టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు. మహిళా పక్షపాతిని, మాది మహిళా ప్రభుత్వం అని చెప్పుకొనే జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు ఆచరణలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక రాజమండ్రిలో దుర్గారావు దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హృదయ విదారకమైనది. అనాథలయిన ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మనసు కలిచివేస్తోంది.

తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులకు ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వరుస బలవన్మరణాలపై ప్రజలకు సమాధానం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని లోన్ యాప్ సంస్థలు దాష్టీకాలకు పాల్పడుతున్నాయి. కేవలం ఒక్క క్లిక్ చాలు నిముషాల్లో డబ్బులు అంటూ ఆశచూపి అప్పుల ఊబిలోకి ప్రజల్ని నెడుతున్నారు. తీరా రుణం ఇచ్చాక వసూలు చేసే క్రమంలో పైశాచికంగా మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. బాధితుల ఫోన్ నెంబర్లకు నగ్న వీడియోలు పంపడం, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి వారిని మానసికంగా వేధిస్తున్నారు. పరువు పోయిందనే బాధతో బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆచంట సునీత ఆరోపించారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళలకు డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో చంద్రబాబు గారు ఆర్థిక తోడ్పాటు అందించారు. వారి కాళ్లపై వారు నిలబడేలా చేశారు. నేడు జగన్ రెడ్డి మహిళా సంక్షేమాన్ని విస్మరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తూట్లు పొడిచారు. ఫలితంగా మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పుల కోసం తప్పని పరిస్థితుల్లో లోన్ యాప్ వంటి సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. మహిళా సంక్షేమం గురించి గొప్పలు చెప్పే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు. డ్వాక్ర మూలధన నిధిపై కన్నేశారు. చేతిలో రూపాయి లేక మహిళలు అధిక వడ్డీలకే అప్పులు చేయాల్సి వస్తోంది. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

లోన్ యాప్ ఆగడాలకు ఒక్క ఈ ఏడాదిలోనే పదుల సంఖ్యలో చనిపోయారు. అప్పు చెల్లించమని రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి బెదిరించడంతో అవమానం తట్టుకోలేక హరిత అనే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళగిరిలో అప్పు చెల్లించినప్పటికీ అశ్లీల చిత్రాలు బంధువులకు పంపుతామనే బెదిరింపులతో, లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక ప్రత్యూష్ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కడియంలో చదువు కోసం రుణం తీసుకున్న సతీష్ అనే పీజీ విద్యార్థి రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు గురి అయ్యాడు. అశ్లీల చిత్రాలు సెల్‌కు పంపి బెదిరించడంతో మానసిక ఒత్తిడికి లోనై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి అని అంగన్వాడీ మరియు డ్వాక్రా విభాగాల టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు.

Tags:    

Similar News