ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి కేబినెట్ ఆమోదం.. సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఏపీ ఆసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూటమి రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల హామీ ఇచ్చింది.

Update: 2024-10-23 13:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఆసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూటమి రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా దీపావళి పండుగ రోజు నుంచి మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఈ రోజు కేబినెట్ ఆమె తెలిపింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. సీఎ తన ట్వీట్‌లో "ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి పండుగ రోజు నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్ర మంత్రి వర్గం ఈ మేరకు నేడు నిర్ణయం తీసుకుంది. మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్షలాది గ్యాస్ కనెక్షన్‌లు అర్హులకు ఇచ్చాం. కట్టెల పొయ్యితో వంటకు ఇబ్బంది పడే ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని ఆనాడు ఆ కార్యక్రమం చేపట్టాం.

ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ నెల (అక్టోబర్) 31వ తేదీ నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్ల పథకం అమల్లోకి తెస్తున్నాం. మహిళలు ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ను పూర్తి ఉచితంగా పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన 24 గంటల్లో సబ్సిడీ జమ చేస్తాం. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నా మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ఏడాదికి రూ.2684 కోట్ల ఖర్చుతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మహిళలకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి కానుకగా అందిస్తున్నది" అని సీఎం చంద్రబాబు నాయుడు రాసుకొచ్చారు. కాగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి కేబినెట్ ఆమోదం పొందడం తో ఈ నెల 31 అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


Similar News