మైనర్లు కాదు దేశ ముదుర్లు.. పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న చిన్నారి హత్యాచార నిందితులు

రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన చిన్నారి అదృశ్యం, అత్యాచారం హత్య కేసులోని అనుమానిత నిందితులు పోలీసులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు.

Update: 2024-07-16 02:49 GMT

దిశ, నందికొట్కూరు: రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన చిన్నారి అదృశ్యం, అత్యాచారం హత్య కేసులోని అనుమానిత నిందితులు పోలీసులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఊరు నడిబొడ్డున ఎవరి కంట పడకుండా బాలిక అదృశ్యం కావడం ఆశ్చర్యంగా ఉంది. తొలుత చంపేసి కృష్ణానదిలో పడేశామని నిందితులు చెప్పారు. కానీ ఇప్పుడు పూడ్చిపెట్టామని చెప్పడం చూస్తుంటే పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దృశ్యం సినిమా తరహాలో...

ఐదు రోజులుగా నదిలో బాలిక మృతదేహం గురించి గాలించారు. గజ ఈతగాళ్లని రంగంలోకి దించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా కూడా బాలిక మృతదేహం దొరక్కపోవడంతో మరోసారి పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈసారి నదిలో పడేయలేదని చెప్పారు ఆ బాలురు. మరి ఏం చేశారురా అంటే.. పూడ్చిపెట్టామని కొన్ని ప్రదేశాలు చూపించారు. ముచ్చుమర్రి, పగిడ్యాల, కొణిదెల ప్రాంతాల్లో ఉన్న స్మశానవాటికల్లో పోలీసులను తిప్పించారు. కానీ ఎక్కడా కూడా బాలిక మృతదేహం కనిపించలేదు. సమీపంలోని చెట్ల దగ్గర ఏమైనా పూడ్చి పెట్టి ఉంటారేమో అని జేసీబీతో చెట్లను తొలగించి చూశారు. చుట్టూ మొత్తం గాలించారు. ఏడవ రోజు కొత్తపల్లి మండలం సంగమేశ్వరం ప్రాంతంలో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ కూడా ఆచూకీ లభించలేదు.

వాళ్లకి ఇన్ని తెలివితేటలు ఉంటాయా..?

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా చూస్తారు కాబోలు.. అందుకే ఇలా పోలీసులను మిస్ గైడ్ చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా పెద్ద వయసున్న నేరస్తుల కేసుల్లో అయితే కేసును చేధించడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అయినప్పటికీ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టి కేసుని త్వరగా చేధిస్తారు. కానీ ఈ మైనర్ పిల్లల విషయంలో మాత్రం 9 రోజులు అయినా బాలిక మృతదేహం ఏమైందన్న విషయం తెలియడం లేదు. అసలు బాలికను నిజంగానే చంపారా? చంపకుండా చంపామని చెబుతున్నారా? బాలురు ఇంకా ఏదైనా దాస్తున్నారా? వీరి వెనుక తల్లిదండ్రులు కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? రాజకీయ కోణం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ విషయంలో ముగ్గురు బాలురు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నిందితులు పోలీసులని మిస్ గైడ్ చేసినట్టు చేస్తున్నారేమో అన్న సందేహాలు బలపడుతున్నాయి.

విచారణకు వర్షం అడ్డంకి..

బాలిక అదృశ్యమైన ఘటన విచారణకు వర్షం అడ్డంకిగా మారింది. తుపాను ప్రభావంతో గాలింపు చర్యలకు వర్షం అడ్డంకులు సృష్టిస్తోంది. ఆదివారం మరోసారి డాగ్ స్వాడ్ ద్వారా చేపట్టిన పోలీసు విచారణ వర్షం కారణంగా ఆగిపోయింది. సోమవారం సైతం ఎలాంటి పురోగతి కనిపించలేదు. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ ఘటనకు ముగింపు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Similar News