అమెరికాలో పాలకొల్లు యువకుడు హత్య.. ఏపీ హోంమంత్రి రియాక్షన్ ఇదే!
అమెరికాలో ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో పాలకొల్లుకు చెందిన వీర సాయేష్(25) మృతి చెందిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో పాలకొల్లుకు చెందిన వీర సాయేష్(25) మృతి చెందిన సంగతి తెలిసిందే. సాయేష్ పట్ల రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సాయేష్ మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆదేశించారు.
ఇకపోతే సాయేష్ స్వస్థలం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఇలా దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఇకపోతే సాయేష్ తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోయారు. తల్లి, అన్నయ్య ఉన్నారు. సాయేష్ 2021 నవంబరులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఎంఎస్ చదువుతూ సాయేష్ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు.గురువారం ఓ దొంగల ముఠా వచ్చి విధుల్లో ఉన్న అతడిని తుపాకీతో కాల్చింది. కుమారుడి మృతి వార్త విన్న తల్లి, సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.