డోలిపై 8 కి.మీ. మోసినా దక్కని ప్రాణాలు

ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల్లేక గిరిజన వాసుల ప్రాణాలు పోతున్న వైనమిది.

Update: 2024-10-15 02:43 GMT

దిశ, గోదావరి జిల్లా ప్రతినిధి: ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల్లేక గిరిజన వాసుల ప్రాణాలు పోతున్న వైనమిది. అల్లూరి సీతారామరాజు జిల్లా పింజరికొండ ఘటన మరువక ముందే మరో గిరిజనుడు సకాలంలో వైద్య సహాయం అందక మృతి చెందాడు. సోమవారం మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు పంచాయతీ నూరుపూడి గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న కేచ్చల తమ్మిరెడ్డి అనే గిరిజనుడిని డోలిపై 8 కిలోమీటర్లు గ్రామస్తుల సహాయంతో కుటుంబ సభ్యులు మోసుకొచ్చారు.

రోడ్డు లేదు, కొండవాగుపై వంతెన లేదు..

రహదారి సౌకర్యం లేక, మరో పక్క కొండ వాగుపై వంతెన లేక, అంబులెన్స్ వచ్చే వీలు లేకపోవడంతో సుమారు 8 కిలోమీటర్లు డోలి పైనే గ్రామస్తులు మోసుకొచ్చారు. వాగులపై వంతెన లేకపోవడంతో డోలిపై మోసేందుకు సమయం పట్టడంతో నొప్పి బాధను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏజెన్సీలో డోలి కష్టాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సున్నంపాడు పంచాయతీ గిరిజనులు కోరుతున్నారు.


Similar News